Uppal: భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్, ఏర్పాట్లు పూర్తి చేసిన హెచ్‌సీఏ!

Uppal: ఉప్పల్‌లో భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధం చేసిన హెచ్‌సీఏ. రూ.750 నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడి.

KARUNAKAR, UPPAL
Published on: 9 Oct 2026 2:19 PM IST
Uppal
X

Uppal: భారత్-వెస్టిండీస్ టీ20 మ్యాచ్, ఏర్పాట్లు పూర్తి చేసిన హెచ్‌సీఏ!

Uppal: భారత్‌–వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈ నెల 14న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌ నిర్వహణకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) సర్వం సిద్ధం చేసింది. ప్రేక్షకులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు మ్యాచ్‌ను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టింది. స్టేడియంలోని మౌలిక సదుపాయాలు, పిచ్‌ల తయారీ, ఫ్లడ్‌లైట్లు, అగ్నిమాపక భద్రత, ఆటగాళ్లకు కల్పించాల్సిన సౌకర్యాలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.జీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్పోర్ట్స్‌ పర్సన్‌ శశి నారాయణ్‌, సీఈఓ ఇంతియాజ్‌ ఖాన్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

రూ.750 నుంచి టికెట్‌ ధరలు

మ్యాచ్‌ కోసం సుమారు 34 వేల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. టికెట్‌ ధరలు రూ.750 నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని, ఇప్పటివరకు 12 వేల టికెట్లు విక్రయించినట్లు వెల్లడించారు. మిగిలిన టికెట్లను మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగు టికెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మరో 5 వేల టికెట్లను ఉచిత ప్రవేశ పాసుల కేటగిరీలో కేటాయించినట్లు వివరించారు.

విద్యార్థులకు ఉచిత ప్రవేశం

క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు 2,500 మంది పాఠశాల విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్‌ వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. ఆర్మీ అధికారుల విద్యార్థులకు 250 ఉచిత ప్రవేశ పాసులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

కొత్త పిచ్‌లు.. పార్కింగ్‌కు ఏర్పాట్లు

మ్యాచ్‌ కోసం రెండు కొత్త పిచ్‌లను సిద్ధం చేసినట్లు హెచ్‌సీఏ కార్యదర్శి వెల్లడించారు. ఫ్లడ్‌లైట్లు, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను సమీక్షించడంతోపాటు ప్రేక్షకులకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. మైదానం నుంచి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ర్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య సేవల కోసం అపోలో ఆసుపత్రులను వైద్య భాగస్వామిగా నియమించామని, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం సుమారు 4,500 వాహనాలకు సరిపడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

పర్యావరణహితంగా మ్యాచ్‌ నిర్వహణ

స్టేడియం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహితంగా మ్యాచ్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)తో కలిసి ‘క్లీన్‌ క్రికెట్‌ ఇనిషియేటివ్‌’లో భాగస్వామిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గ్రీన్‌మ్యాన్యాతో కలిసి వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం, బాధ్యతాయుతంగా తొలగించడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. వ్యర్థాలను పల్లపు ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేకుండా చూడటమే లక్ష్యమని తెలిపారు.

భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించి మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌, మల్కాజిగిరి నగరపాలక సంస్థతోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, ప్రేక్షకుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఏర్పాట్లలో సహకరిస్తున్న పోలీసు శాఖ, బీసీసీఐ, ఇతర ప్రభుత్వ విభాగాలకు కృతజ్ఞతలు తెలిపారు.

రెండు గంటల ముందే చేరుకోవాలి

మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు కనీసం రెండు గంటల ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని జీవన్‌రెడ్డి సూచించారు. చివరి నిమిషంలో రావడం వల్ల ట్రాఫిక్‌ రద్దీ, భద్రతా తనిఖీల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైలులో ప్రయాణించి స్టేడియానికి చేరుకోవాలని కోరారు. ప్రేక్షకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన క్రికెట్‌ అనుభూతిని అందించేందుకు హెచ్‌సీఏ కట్టుబడి ఉందని తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL