Uppal: 4,278 మందికి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ
Uppal: ఉప్పల్ నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 4,278 చేయూత పింఛన్ పత్రాలను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు.
Uppal: 4,278 మందికి కొత్త చేయూత పింఛన్ల పంపిణీ
ఉప్పల్: రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. మంగళవారం ఉప్పల్‌లోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 4,278 మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, డిప్యూటీ కమిషనర్ ఆనంద్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.63 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఇందుకోసం నెలకు రూ.114 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్నప్పటికీ అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా 25,558 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఉప్పల్ నియోజకవర్గంలో 4,278 మందికి పింఛన్లు మంజూరు కాగా.. కాప్రా డివిజన్లో 1,271 మంది, నాచారం డివిజన్లో 1,186 మంది, ఉప్పల్ డివిజన్లో 1,821 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు.
ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా
ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు చీఫ్‌విప్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న కుటుంబ యజమాని దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని వివరించారు. అర్హులైన స్థానికులకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించామని, మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు అందించాలి
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన నిరుపేదలకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హుల దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛను అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందే వరకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమ పథకాలు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదో ఒక పథకం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.




