Hyderabad: ఓయూ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డిగ్రీ లెక్చరర్ నియామక పరీక్షను పాత పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Hyderabad: ఓయూ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన!
Hyderabad: డిగ్రీ లెక్చరర్ నియామక పరీక్షను గతంలో అనుసరించిన విధానంలోనే నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ నాయకురాలు అస్మా డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద డియల్ పోస్టుల పరీక్షలు పాత పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ జీవో నం.4ను రద్దు చేసి, ఇంటర్వ్యూ విధానాన్ని తొలగించాలని కోరారు.
2022 డిసెంబరు 31న అప్పటి ప్రభుత్వం 491 డిగ్రీ లెక్చరర్లు, 24 లైబ్రేరియన్లు, 29 ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులతో కలిపి మొత్తం 544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. అయితే యూజీసీ నిబంధనలు, ఫిజికల్ డైరెక్టర్ల విద్యార్హతలకు సంబంధించి అభ్యంతరాలు రావడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. తాజాగా ఆ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ రద్దు చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న జారీ చేసిన జీవో నం.4 ప్రకారం అకడమిక్ స్కోరుకు 50, రాత పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారని అస్మా తెలిపారు.
అకడమిక్ స్కోరులో పీహెచ్‌డీకి అధిక వెయిటేజీ ఇవ్వడం వల్ల నెట్, సెట్, జేఆర్‌ఎఫ్ అర్హతలు సాధించిన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. రాబోయే నోటిఫికేషన్‌లో నెట్, సెట్, జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీ అర్హతలున్న అభ్యర్థులకు సమ ప్రాధాన్యం కల్పించాలని, పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె కోరారు. పాత విధానంలోనే కేవలం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్‌కుమార్, జక్కుల వెంకటేష్, బానోత్ ప్రేమ్‌కుమార్, సురేందర్, లింగంపల్లి కృష్ణంరాజు, సతీష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.




