Kondapur: కొండాపూర్ పాఠశాలలో యుఎన్ఓ అవగాహన సదస్సు!
Kondapur: కొండాపూర్ ZPHSలో శనివారం ఐక్యరాజ్యసమితి దినోత్సవం నిర్వహించారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల పరిరక్షణలో UNO పాత్రను విద్యార్థులకు వివరించారు.
Kondapur: కొండాపూర్ పాఠశాలలో యుఎన్ఓ అవగాహన సదస్సు!
Kondapur: కొండాపూర్ మసీదుబండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఐక్యరాజ్యసమితి దినోత్సవ అవగాహన కార్యక్రమం’ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి రజని అధ్యక్షత వహించగా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచశాంతి, అంతర్జాతీయ భద్రత, ఆర్థిక, సామాజికాభివృద్ధి మరియు మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా 1945 అక్టోబరు 24న 51 దేశాలతో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితిలోని ప్రధాన అంగాలైన సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక-సాంఘిక మండలి మరియు అంతర్జాతీయ న్యాయస్థానాల పనితీరును, వాటి ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరంగా వివరించారు. అలాగే యునెస్కో (UNESCO), యూనిసెఫ్ (UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి వివిధ అనుబంధ సంస్థల పాత్రను గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆయుధ పోటీ, ఉగ్రవాదం, పర్యావరణ కాలుష్యం, పేదరికం, మానవ హక్కుల ఉల్లంఘన వంటి సవాళ్లను అధిగమించడంలో సమితి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలోనే భారతదేశానికి యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కుతుందని, తద్వారా ప్రపంచ వేదికపై మన దేశ ప్రాతినిధ్యం మరియు ప్రభావం మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు డాక్టర్ అంబేద్కర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, వాణి సాంబశివరావు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.




