LB Nagar: ఓయాసిస్ ఫెర్టిలిటీ అధికారుల అరెస్టు.. రూ.487 కోట్ల లావాదేవీలు!
LB Nagar: ఓయాసిస్ ఫెర్టిలిటీ అక్రమ అండాల సేకరణ కేసులో COO ప్రతిక్ గగ్లానీ, డాక్టర్ రాజర్షి దేబ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
LB Nagar: ఓయాసిస్ ఫెర్టిలిటీ అధికారుల అరెస్టు.. రూ.487 కోట్ల లావాదేవీలు!
LB Nagar: మహిళల అండాలను అక్రమంగా సేకరించి, వ్యాపారంగా మార్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ నెట్‌వర్క్‌లో మరో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రతిక్ అనిల్ గగ్లానీ (44), మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్ (53)లను సరోూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
వీరి విచారణలో దేశవ్యాప్తంగా విస్తరించిన అండాల సేకరణ నెట్‌వర్క్, భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
43 కేంద్రాల్లో కార్యకలాపాలు!
హైదరాబాద్‌లో సద్గురు హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో పది ఓయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. వీటిలో బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లో నాలుగు లెవల్-2 ఐవీఎఫ్ కేంద్రాలు ఉన్నాయి.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా మహిళలను సమీకరించి అండాల సేకరణకు వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. మియాపూర్‌లోని ఏఆర్‌టీ బ్యాంకు ఇన్‌ఛార్జి సునీల్‌రాయ్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నెలకు 100 అండాల దాన చక్రాలు!
దేశవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న 43 క్లినిక్‌లలో ప్రతినెలా సుమారు 600 స్వీయ చికిత్సా చక్రాలు, మరో 100 అండాల దాన ప్రక్రియలు జరుగుతున్నట్లు నిందితుల వాంగ్మూలాల్లో వెల్లడైంది. వీటి ద్వారా నెలకు రూ.27-28 కోట్ల ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అండాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి తదుపరి వైద్య ప్రక్రియలకు పంపినట్లు విచారణలో వెలుగుచూసింది.
రూ.487 కోట్ల లావాదేవీలు!
సద్గురు హెల్త్‌కేర్ సంస్థకు సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాను పరిశీలించిన పోలీసులు కీలక విషయాన్ని గుర్తించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు ఈ ఖాతాలో జరిగిన డెబిట్, క్రెడిట్ లావాదేవీల మొత్తం విలువ రూ.487.82 కోట్లుగా తేలింది. ఈ భారీ లావాదేవీలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు.
యాజమాన్యం సూచనల మేరకే!
2025 నుంచి COOగా పనిచేస్తున్న ప్రతిక్ గగ్లానీ.. కేంద్రాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, నిధుల సమీకరణ, కార్యకలాపాల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
మరో నిందితుడు డాక్టర్ రాజర్షి దేబ్ వైద్యుల నియామకాలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ, వైద్యపరమైన కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధమైన విధానాలకు అంగీకరించే వైద్యులను నియమించాలని యాజమాన్యం సూచించినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. అధిక వేతనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ వ్యవహారాల్లో పాల్గొన్నట్లు ఇద్దరు నిందితులు వెల్లడించారని వివరించారు.
డిజిటల్ ఆధారాలు స్వాధీనం
నిందితుల నుంచి మూడు ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిక్ గగ్లానీ వద్ద రెండు, డాక్టర్ రాజర్షి దేబ్ వద్ద ఒక ఫోన్‌ను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించింది.




