Moinabad: మొయినాబాద్‌లో విషాదం.. పోలీసులను చూసి పరుగెత్తి విద్యుత్ తీగ తగిలి మృతి!

Moinabad: పెద్దమంగళారంలో పోలీసులను చూసి పరుగెత్తిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి దుర్మరణం చెందారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 31 Oct 2026 10:16 AM IST
Moinabad
X

Moinabad: మొయినాబాద్‌లో విషాదం.. పోలీసులను చూసి పరుగెత్తి విద్యుత్ తీగ తగిలి మృతి!

Moinabad: పంట పొలాలను అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన రైతు చర్య ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలు బలిగొంది. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుందాని సమాచారం. ఈ ఘటనలో కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మూక్షా చరణ్(20), యశ్వంత్ (20) అక్కడికక్కడే మృతిచెందారు.

మొత్తం 10 నుంచి 12 మంది విద్యార్థులు మద్యం బాటిళ్లతో బహిరంగ ప్రదేశంలో జల్సా చేస్తుండగా, అటుగా వచ్చిన పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భయంతో విద్యార్థులు సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీసినట్లు సమాచారం.

ఈ క్రమంలో పెద్దమంగళారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 320, 330లో ఉన్న బోలిచెర్వు రాజిరెడ్డి(45)కు చెందిన సుమారు అర ఎకరం వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పొలం చుట్టూ అడవి పందుల నివారణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక సమాచారం. పంట రక్షణ కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం ఇద్దరు యువకుల పాలిట మృత్యుపాశంగా మారింది.

మృతుల్లో మూక్షా చరణ్ రాజేంద్రనగర్లోని ఉప్పర్పల్లికి చెందిన మహేష్ కుమారుడు కాగా, యశ్వంత్ బల్కంపేటకు చెందిన మహేష్ కుమారుడిగా సమాచారం. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మృతుల తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదఛాయాలు అలుముకున్నాయి. పొలం రక్షణ పేరుతో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడంపై, ఘటనకు దారి తీసిన పరిస్థితులపై పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA