Ghatkesar: భవనంపై నుంచి పడి బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు!

Ghatkesar: ఘట్‌కేసర్‌లోని కె.పి.ఆర్.ఐటీ కళాశాల భవనంపై నుంచి పడి బీటెక్ విద్యార్థిని పల్లవికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. ఇటీవల కానిస్టేబుల్‌తో వివాహం.. పోలీసుల దర్యాప్తు.

KARUNAKAR, UPPAL
Published on: 18 Sept 2026 11:24 PM IST
Ghatkesar
X

Ghatkesar: భవనంపై నుంచి పడి బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు!

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఘన్‌పూర్‌లో ఉన్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కె.పి.ఆర్.ఐటీ)లో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థిని పల్లవి కళాశాల భవనం నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది.

తల, చేతులకు తీవ్ర గాయాలైన ఆమెను కళాశాల సిబ్బంది తొలుత జోడిమెట్లలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

యాదాద్రి-భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లికి చెందిన పల్లవికి ఆగస్టు 30న బోడుప్పల్‌ ప్రాంతంలో నివాసం ఉంటూ, చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బద్దం శ్రీకాంత్‌రెడ్డితో వివాహం జరిగింది.

పల్లవి నెల రోజులుగా కళాశాలకు వెళ్లలేదని, ఈ నెల 17న తిరిగి తరగతులకు హాజరయ్యారని ఆమె తల్లి సంధ్య పోలీసులకు తెలిపినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లిన పల్లవి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో భవనం నుంచి పడిపోయినట్లు కళాశాల నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందింది. అప్పటికే ఆమెను మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే కళాశాలలో జరిగిన ఘటనపై అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా దర్యాప్తు చేయాలని సంధ్య పోలీసులను కోరినట్లు తెలిసింది. పల్లవి ప్రమాదవశాత్తు భవనం నుంచి పడిపోయిందా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా.. లేక మరేదైనా కారణముందా అన్నది తెలియాల్సి ఉంది.

ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కళాశాలలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కొన్ని కెమెరాలు పనిచేయడం లేదని, మరికొన్ని ఫుటేజీ కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL