Malkajgiri: మల్కాజిగిరిలో 'గణేష్ సురక్ష సంకల్ప్-2026' అవగాహన!
Malkajgiri: మల్కాజిగిరి మారుతి నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘గణేష్ సురక్ష సంకల్ప్–2026’. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వినాయక మండపం వద్ద అవగాహన.
Malkajgiri: మల్కాజిగిరిలో 'గణేష్ సురక్ష సంకల్ప్-2026' అవగాహన!
Malkajgiri: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. గణేష్ సురక్ష సంకల్ప్–2026లో భాగంగా మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో మారుతి నగర్ శివాజీ పార్క్ లో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి సీఐ విజయ్ కుమార్, ఎస్‌ఐ శంకర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సమయంలో రహదారులపై అనవసర రద్దీకి కారణం కాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని, ట్రాఫిక్ సూచనలు, మార్గమళ్లింపులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అతివేగం, ముగ్గురితో ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
వినాయక మండపాల వద్ద చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు నిర్వాహకులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు. పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాద నివారణ చర్యలు, భక్తుల రాకపోకలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ, ఎస్‌ఐ కోరారు.




