Bachupally: బాచుపల్లి ఎస్‌టీపీ ట్యాంకులో విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికుల మృతి!
Bachupally: బాచుపల్లిలోని దినేశ్ ఔరిక్ అపార్ట్‌మెంట్ ఎస్‌టీపీ ట్యాంకులో మంగళవారం విషవాయువులు పీల్చి ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
Bachupally: బాచుపల్లి ఎస్‌టీపీ ట్యాంకులో విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికుల మృతి!
బాచుపల్లి: ఉపాధి కోసం పనికి వెళ్లిన ముగ్గురు కార్మికులు విగతజీవులుగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ప్రమాదంలో చిక్కుకున్న సహచరుడిని కాపాడాలన్న ప్రయత్నం మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. బాచుపల్లిలోని దినేశ్ ఔరిక్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ) ట్యాంకులో పేరుకుపోయిన విషవాయువుల కారణంగా ముగ్గురు కార్మికులు ఊపిరాడక మరణించారు.
సహచరుడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు మృతి
ఎస్‌టీపీ శుభ్రత పనుల కోసం అపార్ట్‌మెంట్ అసోసియేషన్ బయటి సంస్థను సంప్రదించింది. మధ్యవర్తి ద్వారా హెచ్‌ఆర్ ఎన్విరో ప్రొటెక్షన్ సిస్టమ్స్‌కు చెందిన షణ్ముఖ రావు అలియాస్ సురేశ్ (25)కు పని అప్పగించినట్లు సమాచారం. తన బంధువులైన పవన్ (25), సుమన్ (24)లను కూడా సురేశ్ వెంట తీసుకొచ్చాడు. తొలుత ట్యాంకులోకి దిగిన సురేశ్ నుంచి కేకలు వినిపించడంతో పవన్ అతడిని రక్షించేందుకు లోపలికి వెళ్లాడు. అయితే అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం సుమన్ కూడా వారిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగగా బయటకు రాలేకపోయాడు. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.
కంపెనీ యజమానిపై కేసు.. అపార్ట్‌మెంట్ బాధ్యతలపై ఆరా
సురేశ్ బంధువు బాలసాయి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కంపెనీ యజమాని రవిపై కేసు నమోదు చేశారు. ట్యాంకులో హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు ఉండటంతోపాటు ఆక్సిజన్ కొరత ఏర్పడి ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల అసంతృప్తి
మృతుల కుటుంబాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాలను ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆరోపించారు. అపార్ట్‌మెంట్ యాజమాన్యానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరించారని, తమను లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.




