Ghatkesar: బైక్‌పై వచ్చి మహిళ చేతిలోని రూ.40 వేలు లాక్కొని దొంగలు పరార్!

Ghatkesar: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సన్‌షైన్‌ పార్క్ సమీపంలో మహిళ చేతిలోని రూ.40 వేల నగదును బైక్‌పై వచ్చిన ముగ్గురు దొంగలు లాక్కెళ్లారు.

KARUNAKAR, UPPAL
Updated on: 29 Nov 2026 2:19 PM IST
Ghatkesar
X

Ghatkesar: బైక్‌పై వచ్చి మహిళ చేతిలోని రూ.40 వేలు లాక్కొని దొంగలు పరార్!

Ghatkesar: ఇళ్లలో పనిచేసి కూడబెట్టుకున్న నగదును తీసుకుని వెళ్తున్న ఓ మహిళను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె చేతిలో ఉన్న రూ.40 వేల నగదును బలవంతంగా లాక్కొని బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ఈడబ్ల్యూఎస్‌ కాలనీకి చెందిన బైరోజు శైలజ (32) సన్‌షైన్‌ పార్క్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోని ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన అవసరాల నిమిత్తం పనిచేసే ఇంటి యజమాని వద్ద దాచుకున్న రూ.40 వేల నగదును తీసుకుని ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో బయటకు వచ్చింది.

సన్‌షైన్‌ పార్క్‌ సమీపంలో నగదును సరిచూసుకుంటుండగా పల్సర్‌ బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమె వద్దకు చేరుకున్నారు. ఆమె చేతిలోని నగదును బలవంతంగా లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులను ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు, నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL