Vanastalipuram: డ్రైవర్లపై కత్తులతో దాడి.. సెల్‌ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్!
Vanastalipuram: అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లపై కత్తులతో దాడి చేసి సెల్‌ఫోన్లు అపహరిస్తున్న ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.
Vanastalipuram: డ్రైవర్లపై కత్తులతో దాడి.. సెల్‌ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్!
Vanastalipuram: అర్ధరాత్రి, తెల్లవారుజామున రోడ్లపై ఒంటరిగా ఉండే ఆటో, క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. సెల్‌ఫోన్లు అపహరించేందుకు ప్రయత్నిస్తూ అడ్డుకున్న వారిపై కత్తులతో దాడులకు తెగబడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు డ్రైవర్లపై కత్తులతో దాడి చేసి సెల్‌ఫోన్లు అపహరించిన కేసులను ఛేదించారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 25న తెల్లవారుజామున 3 గంటల సమయంలో కేఎల్‌ఎం షాపింగ్ మాల్ సమీపంలో ఆటో డ్రైవర్ చిన్నం రవికుమార్ ప్రయాణికుడిని దింపి అలసటతో ఆటోలోనే నిద్రపోయాడు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడి సెల్‌ఫోన్ అపహరించేందుకు ప్రయత్నించారు. మేల్కొన్న రవికుమార్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఓ నిందితుడు కత్తితో కుడిచేతి మణికట్టు వద్ద పొడిచి ఫోన్ లాక్కొని పరారయ్యాడు.
అదే రోజు తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల మధ్య మల్లికార్జున నగర్ కమాన్ సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. సీఎన్‌జీ నింపించుకుని క్యాబ్‌ను నిలిపిన డ్రైవర్ మేఘావత్ రమేష్ వాహనంలోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి వివో సెల్‌ఫోన్‌ను అపహరించారు. వారిని వెంబడించి నిలదీయడంతో ఓ వ్యక్తి కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు.
ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పానామా ఎక్స్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రెండు దోపిడీ ఘటనలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులు మహ్మద్ ఫైజాన్ అలియాస్ షూటర్, మహ్మద్ అక్బర్, వేముల రాకేష్‌గా పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి బాధితులకు చెందిన ఇన్ఫినిక్స్, వివో సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ చట్టం కింద కూడా చర్యలు చేపట్టారు.
నిందితులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న వాహనదారులను గుర్తించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఫైజాన్‌పై గతంలోనూ కేసులు ఉండగా, అక్బర్‌పై కూడా పలు కేసులు నమోదైనట్లు వనస్థలిపురం ఏసిపి కాశిరెడ్డి వెల్లడించారు.




