Bachupally: బాచుపల్లి ఎస్‌టీపీ ప్రమాదంపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం.. సుమోటో విచారణ!

Bachupally: బాచుపల్లిలో ఎస్‌టీపీ ట్యాంకు శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటో విచారణ చేపట్టి డిసెంబర్ 22లోగా నివేదిక కోరింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 25 Nov 2026 8:02 PM IST
Bachupally
X

Bachupally: బాచుపల్లి ఎస్‌టీపీ ప్రమాదంపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం.. సుమోటో విచారణ!

బాచుపల్లి: బాచుపల్లిలోని దినేష్‌ ఔరిక్‌ అపార్ట్‌మెంట్‌లో ఎస్‌టీపీ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు.

ప్రమాదానికి గల కారణాలు, భద్రతా నిబంధనల అమలు, అపార్ట్‌మెంట్‌ యాజమాన్యం, కాంట్రాక్టర్‌ బాధ్యతలపై సమగ్ర నివేదికలు డిసెంబర్‌ 22లోగా సమర్పించాలని ఆదేశించారు. బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టే చర్యల వివరాలను అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు అందించిన పరిహారం, ఎక్స్‌గ్రేషియా, ఇతర సహాయ వివరాలను కూడా కలెక్టర్‌ను కోరారు.

మరోవైపు, ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ బుధవారం పరిశీలించారు. హైడ్రా, సీఎంసీ అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఒక కార్మికుడిని కాపాడేందుకు మరొకరు ట్యాంకులోకి దిగుతూ వరుసగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ) నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఎస్‌టీపీల నిర్మాణంతోపాటు నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు.

ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించామని గేటెడ్‌ కమ్యూనిటీలు చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఎస్‌టీపీలు, సెప్టిక్‌ ట్యాంకుల్లో విషవాయువులు బయటకు వెళ్లేలా తగిన వెంటిలేషన్‌ ఏర్పాటు చేయాలని, శుభ్రపరిచే పనులను శిక్షణ పొందిన సిబ్బందితోనే చేయించాలని రంగనాథ్‌ సూచించారు. కార్మికులకు అవసరమైన శ్వాస రక్షణ పరికరాలు అందించకుండా ట్యాంకుల్లోకి దించడం ప్రాణాంతకమన్నారు. నిర్వహణ ఏజెన్సీలు శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యత, భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

దినేష్‌ ఔరిక్‌ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌, హెచ్‌ఆర్‌ ఇన్విరో సంస్థ మధ్య ఎస్‌టీపీ, సెప్టిక్‌ ట్యాంకు నిర్వహణ, శుభ్రపరిచే పనులకు సంబంధించి ఒప్పందం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై బాచుపల్లి పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎస్‌టీపీల నిర్వాహకులు, గేటెడ్‌ కమ్యూనిటీల ప్రతినిధులు, ప్రైవేటు ఏజెన్సీలతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించనున్నట్లు హైడ్రా కమిషనర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని ఎస్‌టీపీల తనిఖీలను కూడా ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR