Hyderabad: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచాలి: టీడీఏ డిమాండ్!
Hyderabad: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను పెంచి, జీవో 31ని యూజీసీ నిబంధనలకు అనుగుణంగా సవరించాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ ఉన్నత విద్యామండలిని కోరింది.
Hyderabad: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెంచాలి: టీడీఏ డిమాండ్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య పెంచాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్(టీడీఏ) డిమాండ్ చేసింది. జీవో 31లో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాలని కోరింది.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌లను.. టీడీఏ సలహదారు డాక్టర్ పి. రమణరావు, అధ్యక్షులు డాక్టర్ పి. నరేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ తిరుపతి బొల్లం, డాక్టర్ రామానాయుడు, డాక్టర్ స్వామి నాయక్, డాక్టర్ మహేందర్, డాక్టర్ రవితేజలు కలిసి వినతి పత్రం సమర్పించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేవలం 429 పోస్టుల భర్తీతో సరిపెట్టకుండా, ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయాలని కోరారు.
ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన జీఓ నంబర్ 31లోని నియామక నిబంధనలను యూజీసీ 2018 మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాలని కోరారు. యూజీసీ పరిశోధన ప్రాజెక్టులు, స్వయం, ఎంఓఓసీ కోర్సుల రూపకల్పన, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఉపన్యాస అవకాశాలు ఎక్కువగా శాశ్వత అధ్యాపకులకే లభిస్తున్నాయని వివరించింది. దీంతో తాత్కాలిక అధ్యాపకులు, కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
అందువల్ల ఈ నిబంధనలను సవరించి ప్రతిభ ఆధారంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరింది. విశ్వవిద్యాలయాల నియామకాల దరఖాస్తులకు సెంట్రల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని టీడీఏ సూచించింది. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అభ్యర్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే విధానం తీసుకురావాలని, రాష్ట్రంలోని 33 జిల్లాల పాఠశాలల వివరాల ఆధారంగా స్థానికతను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
ఇంటర్వ్యూలకు అభ్యర్థులను 1:25 నిష్పత్తిలో పిలవాలని అసోసియేషన్ మరో ప్రతిపాదన చేసింది. దీనివల్ల బోధనా నైపుణ్యాలు కలిగిన ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం లభిస్తుందని తెలిపింది. అధ్యాపక నియామకాల్లో దరఖాస్తులు, ఏపీఐ స్కోర్ల పరిశీలన పారదర్శకంగా జరగాలని అసోసియేషన్ పేర్కొంది. ఏవైనా సందేహాలుంటే అభ్యర్థుల దరఖాస్తులను నేరుగా తిరస్కరించకుండా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని సూచించింది.
ఇంటర్వ్యూలకు కనీసం నెల రోజుల ముందే దరఖాస్తుల పరిశీలన, ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి చేయాలని కోరింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య పెంపు, మంజూరైన పోస్టుల భర్తీ, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా జీఓ 31 సవరణపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరింది.




