Ghatkesar: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి!

Ghatkesar: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఘట్‌కేసర్‌ సీఐ పి. కిరణ్‌ ఏదులాబాద్‌ మేఘా కళాశాలలో పిలుపునిచ్చారు.

KARUNAKAR, UPPAL
Published on: 27 Nov 2026 6:48 PM IST
Ghatkesar
X

Ghatkesar: విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి!

ఘట్‌కేసర్‌: యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని.. వారు మత్తు పదార్థాలకు బానిసలైతే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజ ప్రగతిపైనా ప్రభావం పడుతుందని ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి. కిరణ్‌ అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఏదులాబాద్‌లో ఉన్న మేఘా ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఇన్‌స్పెక్టర్‌.. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి విక్రయాలు, వినియోగంపై ఉన్న చట్టపరమైన చర్యలను వివరించారు.

విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిసలైతే ఉజ్వల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.

కళాశాల పరిసరాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే డయల్‌ 112 లేదా 1903కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL