Aushapur: 13 ఏళ్ల తర్వాత ఔషాపూర్ జాతీయ రహదారిపై వెలుగులు!

Aushapur: ఔషాపూర్‌ జాతీయ రహదారిపై 13 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత వీధి దీపాలను ప్రారంభించారు. బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా వెలుగులు.

KARUNAKAR, UPPAL
Published on: 10 Oct 2026 9:07 PM IST
Aushapur
X

Aushapur: 13 ఏళ్ల తర్వాత ఔషాపూర్ జాతీయ రహదారిపై వెలుగులు!

ఔషాపూర్‌: జాతీయ రహదారిపై వీధి దీపాల కోసం 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఔషాపూర్‌ ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. గ్రామ పరిధిలోని ఎన్‌హెచ్‌–163 బైపాస్‌పై నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి, ఘట్‌కేసర్‌ మండల మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సుమారు నెల రోజుల క్రితం ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ భరద్వాజ్‌ను కలిసి పరిస్థితిని వివరించినట్లు పేర్కొన్నారు.

వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్న తన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకున్నారని చెప్పారు. దీపాల ఏర్పాటు పూర్తికావడంతో పీడీ భరద్వాజ్‌తో పాటు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వీధి దీపాలు అందుబాటులోకి రావడంతో రాత్రివేళల్లో ప్రయాణాలు సులభతరం కావడంతో పాటు రహదారిపై మెరుగైన వెలుతురు అందనుంది.

ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏనుగు లక్ష్మారెడ్డి, సీనియర్‌ నాయకులు ఏనుగు మచ్చేందర్‌రెడ్డి, కాసుల వెంకటేష్‌గౌడ్‌, మహేష్‌, గుమ్మడి దర్శన్‌, సుహాన్‌, సత్తి, పర్వీన్‌, ఆంజనేయులు, సాయి తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL