Vikarabad: వికారాబాద్ దసరా వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్!
Vikarabad: వికారాబాద్ ఆలంపల్లి శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభస్వామి ఉత్సవాల్లో పాల్గొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్. పట్టువస్త్రాల సమర్పణ, పల్లకీ సేవ, జమ్మి పూజల నిర్వహణ.
Vikarabad: వికారాబాద్ దసరా వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్!
Vikarabad: దసరా పండుగ సంబురాలు వికారాబాద్ నియోజకవర్గంలో అంబరాన్నంటాయి. వికారాబాద్ పట్టణంలో మంగళవారం రోజు అలంపల్లి శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభస్వామి దసరా నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణ శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి పల్లకీ సేవలో పాల్గొన్నారు. స్వయంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వామివారి పల్లకీని మోశారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు, పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించి, స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఆశీర్వదించారు.
శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని జమ్మి చెట్టుకు (శమీ పూజ) స్పీకర్ ప్రసాద్ కుమార్ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారు. అలంపల్లి, వికారాబాద్ పట్టణంలోని ప్రధాన పుర వీధులు, కూడళ్ల మీదుగా సాగిన స్వామివారి ఊరేగింపులోనూ స్పీకర్ పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మధ్య సాగింది. స్వామి ఊరేగింపులో పాల్గొన్న స్పీకర్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ప్రజలు, మహిళలు, చిన్నారులు, అన్ని పార్టీల నాయకులు ఉత్సాహం, ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను పేరు పేరునా ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అంతకుముందు, స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఆలయ సిబ్బంది, అధికారులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి : స్పీకర్
ఆలంపల్లిలోని బోనమ్మ గుంత జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా స్థలిలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారితో అన్ని పార్టీల నాయకులు పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. తెలంగాణలో దసరా అంటే జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ చేయడం. జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకునే గొప్ప సంప్రదాయం మనది. ఈ సంప్రదాయం మనకు ప్రకృతిని ప్రేమించమని, పెద్దలను గౌరవించమని చెబుతుంది. ఈ పవిత్రమైన రోజున రాష్ట్రంలోని రైతులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నాను. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించాను. అలాగే ప్రకృతి విపత్తు అయిన ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అమ్మవారు ఇవ్వాలని కోరుకున్నాను అని స్పీకర్ ప్రసాద్ కుమార్ చెప్పారు.
వికారాబాద్ ను మరింతగా అభివృద్ధి చేస్తాం : స్పీకర్
రానున్న రోజుల్లో వికారాబాద్ పట్టణంతో పాటు వికారాబాద్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అనారోగ్య కారణాల వల్ల దసరా వేడుకలకు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య గారు పాల్గొనలేకపోతున్నా, ఆమె ఆలోచనలన్నీ ఎప్పుడూ వికారాబాద్ పట్టణం అభివృద్ధి, పట్టణ ప్రజలపైనే ఉంటాయన్నారు. మరికొద్ది రోజుల్లోనే వికారాబాద్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులన్నీ సమకూరుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
వికారాబాద్ పట్టణం, నియోజకవర్గం అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, మరిన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటానని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిజమైన దసరా స్ఫూర్తితో పని చేస్తోందని, ప్రజలే దేవుళ్లుగా భావిస్తూ, రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని వివరించారు. మీ అభివృద్ధే నా లక్ష్యం, మీ చిరునవ్వే నా విజయం. ఈ దసరా వేళ మనమంతా కలిసి మంచి వైపు నడుద్దాం. మన వికారాబాద్ ను, మన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిద్దాం అంటూ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రజలకు స్పష్టం చేశారు.
రావణ దహన కార్యక్రమంలో స్పీకర్ గారు
ఆలంపల్లిలోని బోనమ్మ గుంత జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలోనూ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. భారీ రావణాసుర బొమ్మను దహనం చేశారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ ఉత్సవాల్లో ఎంతో సంతోషంగా పాల్గొన్నారు.
జమ్మి చెట్టుకు స్పీకర్ ప్రత్యేక పూజలు
రావణ దహన కార్యక్రమం తర్వాత బోనమ్మ గుంత ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టుకు (శమీ పూజ) అత్యంత భక్తి శ్రద్ధలతో స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అందరికీ ఆప్యాయంగా అలయ్ బలయ్ చెప్పి, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
దసరా వేడుకల్లో ఆత్మీయులతో స్పీకర్ గారు
దసరా వేడుకల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు పాల్గొనడంతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు, అభిమాన పలకరింపులతో వికారాబాద్ పట్టణం పండుగ శోభను సంతరించుకుంది. ఆప్యాయతను పంచుకుంటూ, ఆత్మీయతను చాటుకుంటూ సాగిన ఈ వేడుకలు దసరా సంప్రదాయాల గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పాయి. దసరా సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ తన సొంత నియోజకవర్గంలోని ప్రజల మధ్య ఆత్మీయంగా గడుపుతూ, పెద్దలు, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, సరదాగా ముచ్చటిస్తూ పండుగ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. జమ్మి చెట్టుకు పూజలు చేసిన తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఆలయ ప్రధాన పూజారి అప్పగారిని మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
వికారాబాద్ ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లోనూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్ రెడ్డి, రాఘవేందర్, వికారాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, సామా ప్రభాకర్ రెడ్డి, డీఎస్పీ ఆంజనేయులు, సీఐ రఘు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




