Hyderabad: ఒడిశాలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ

Hyderabad: ఒడిశాలో సింగరేణి కార్యాలయం, కాలనీ ఏర్పాటు, నైనీ గని విస్తరణ, థర్మల్ ప్లాంట్ భూసేకరణకు సహకరించాలని అంగూల్ కలెక్టర్‌ను సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి కోరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 27 Oct 2026 8:21 PM IST
Hyderabad
X

Hyderabad: ఒడిశాలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ

హైదరాబాద్: ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని కార్యకలాపాల విస్తరణకు, బొగ్గు రవాణా మార్గాల నిర్మాణానికి అవసరమైన స్థలాల కేటాయింపు, అనుమతుల మంజూరులో సహకరించాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్‌ను కోరారు. నైనీ గని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సింగరేణికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మంగళవారం అంగూల్ జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో సింగరేణి ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎండీ చర్చించారు. నైనీ బొగ్గు గని విస్తరణ, బొగ్గు రవాణా, నిర్వాసితుల పునరావాసం, థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల నివాస సముదాయ నిర్మాణానికి అవసరమైన స్థలాల కేటాయింపు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం సహకారం కోరారు.

40 కుటుంబాలకు పునరావాస కాలనీ

నైనీ బొగ్గు గని కారణంగా నిర్వాసితులైన 40 కుటుంబాల కోసం పునరావాసం, పునరుద్ధరణ (ఆర్‌ అండ్‌ ఆర్‌) కాలనీ నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని సీఎండీ కోరారు. నిర్వాసితులకు సంబంధించిన పునరావాస ప్యాకేజీల అమలు, కాలనీ నిర్మాణానికి భూసేకరణ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలోనే రిహాబిలిటేషన్ అండ్‌ పెరిఫెరి అడ్వైజరీ కమిటీ (RPDAC) సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు.

నిర్వాసిత కుటుంబాలకు పునరావాస సదుపాయాలు కల్పించే ప్రక్రియలో జాప్యం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

నైనీ గని సమీపంలో థర్మల్ విద్యుత్ కేంద్రం

నైనీ బొగ్గు గనికి అనుబంధంగా ఒడిశాలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తుకుడా, జరపడా గ్రామాల పరిధిలో గుర్తించిన స్థలం అనుకూలంగా ఉందని పేర్కొంటూ, అవసరమైన భూసేకరణకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన అనుమతులు, స్థల కేటాయింపు అంశాలపై సంబంధిత శాఖలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రూ.35 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన

నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని జరపడా రైల్వే జంక్షన్‌కు తరలించేందుకు చండీపడా–జరపడా గ్రామాల మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం కీలకమని సింగరేణి సీఎండీ తెలిపారు. ఈ రహదారి నిర్మాణం కోసం సింగరేణి ఇప్పటికే రూ.35 కోట్లను డిపాజిట్ చేసిందని వివరించారు.

ఈ రహదారి బొగ్గు రవాణాకు ప్రత్యేక కారిడార్‌గా ఉపయోగపడటంతో పాటు, ఇతర బొగ్గు ఉత్పత్తి పరిశ్రమలకు కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.

అలాగే స్థానిక గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బొగ్గు రవాణా నిర్వహించేందుకు మాఝికా బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని తెలిపారు.

ఒడిశాలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ

ఒడిశాలో సింగరేణి కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యాలయ నిర్మాణానికి, ఉద్యోగుల నివాస సముదాయం ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించి కేటాయించాలని సీఎండీ కోరారు. నైనీ గని కార్యకలాపాల నిర్వహణ, ఉద్యోగులకు అవసరమైన సదుపాయాల కల్పనలో ఈ నిర్మాణాలు కీలకంగా ఉంటాయని వివరించారు.

దేశ విద్యుత్ అవసరాలను తీర్చడంలో సింగరేణి చేస్తున్న కృషికి తమ సహకారం ఉంటుందని అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులకు అవసరమైన అంశాలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తామని తెలిపారు.

జిందాల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌ను సందర్శించిన సింగరేణి బృందం

అంగూల్ జిల్లాలో జిందాల్ సంస్థ ఏర్పాటు చేసిన కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌ను సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ డైరెక్టర్లు గౌతమ్ పోట్రు, ఎల్‌.వి. సూర్యనారాయణ, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) టి. శ్రీనివాస్ సందర్శించారు.

ఈ ప్లాంట్‌లో దేశీయ బొగ్గు నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసి జిందాల్ స్టీల్ పరిశ్రమలో వినియోగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. సింగరేణిలో మూతపడిన భూగర్భ గనుల నుంచి లభించే బొగ్గును కోల్ గ్యాసిఫికేషన్‌కు వినియోగించే అవకాశాలు, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలపై నిపుణులతో చర్చించారు.

జిందాల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్‌కు సింగరేణి నైనీ గని నుంచి కూడా కొంత బొగ్గు సరఫరా అవుతుండటం గమనార్హం. ఈ పర్యటనలో నైనీ గని జనరల్ మేనేజర్ బైద్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.