Hyderabad: కీలక ఖనిజ రంగంలో అమెరికాతో సింగరేణి జట్టు!
Hyderabad: కీలక ఖనిజాల అన్వేషణ, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, డేటా సెంటర్ల ఏర్పాటుపై అమెరికా కాన్సులేట్ బృందంతో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి కీలక చర్చలు జరిపారు.
Hyderabad: కీలక ఖనిజ రంగంలో అమెరికాతో సింగరేణి జట్టు!
హైదరాబాద్, నవంబర్ 6: దేశీయ బొగ్గు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ.. ఇప్పుడు కీలక ఖనిజాల అన్వేషణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా సంస్థలతో సాంకేతిక, వ్యాపార భాగస్వామ్యాలకు సిద్ధమవుతోంది. కీలక ఖనిజాల అన్వేషణ నుంచి పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, డేటా సెంటర్ల ఏర్పాటు వరకు పలు అంశాలపై అమెరికా కాన్సులేట్ ప్రతినిధి బృందంతో సింగరేణి ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో శుక్రవారం సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో అమెరికన్ కాన్సులేట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ చీఫ్ మెరెడిత్ మెజ్లర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కీలక ఖనిజాల రంగంలో అమెరికా సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను ఇరు పక్షాలు చర్చించాయి.
మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఇప్పటికే కీలక ఖనిజాల రంగంలోకి ప్రవేశించిందని సీఎండీ వివరించారు. ఈ రంగంలో అంతర్జాతీయ సంస్థలతో సాంకేతిక సహకారం, ఉమ్మడి భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీలోని పరిశోధన సౌకర్యాలు, ఓపెన్‌కాస్ట్ గనుల ఓవర్బర్డెన్లో లభించే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌పై అమెరికా ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లపై ప్రత్యేక చర్చ
మూతపడిన ఓపెన్‌కాస్ట్ గనులను నిరుపయోగంగా వదిలేయకుండా వాటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చేందుకు సింగరేణి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. డేటా సెంటర్లకు అత్యధిక విద్యుత్ అవసరమయ్యే పీక్ అవర్స్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ ప్లాంట్లు ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. తగిన పెట్టుబడులు, భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలున్నాయని తెలిపారు. సమీపంలోని గోదావరి నది నుంచి నీటిని వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని అమెరికా ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణలో సింగరేణి పరిధిలో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు అమెరికన్ కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయని, మరికొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు ఈ రంగం అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
కీలక ఖనిజాల రంగంలో విదేశీ పెట్టుబడులు, పరిశోధన సంస్థల భాగస్వామ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సింగరేణి ఆహ్వానిస్తోందని సీఎండీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించనున్న కీలక ఖనిజాల సదస్సులో పాల్గొనాలని సింగరేణి సంస్థను అమెరికా కాన్సులేట్ బృందం ఆహ్వానించింది.
ఈ సందర్భంగా అమెరికన్ ప్రతినిధి బృందాన్ని సింగరేణి గనులతో పాటు కొత్తగూడెంలోని జియో సైన్స్ ల్యాబొరేటరీని సందర్శించాలని సీఎండీ ఆహ్వానించారు. ఈ సమావేశంలో అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు శ్రీమలి కరి, శిబా త్రిపాఠి, సునీల్ కుమార్‌తో పాటు సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్లు టి. శ్రీనివాస్, కె. రామదాసు, పంకజ్ కులశ్రేష్ట, గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




