Shabad: వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేయాలి

Shabad: షాబాద్ మండలం సంకేపల్లిగూడలో జరిగిన క్షేత్ర పాఠశాలలో యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 16 Nov 2026 4:00 PM IST
Shabad
X

Shabad: వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేయాలి

షాబాద్: మండలంలోని సంకేపల్లిగూడ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సహకారంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరిలో క్షేత్ర పాఠశాల (ఫార్మ్ స్కూల్) శిక్షణ, యాసంగి కూరగాయల పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పంటలను సాగు చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించారు.

ఈ కార్యక్రమానికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) కృషి విజ్ఞాన కేంద్రం, హయత్‌నగర్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. జి. శ్రీకృష్ణ, డా. దిలీప్ హాజరై రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డా. దిలీప్ మాట్లాడుతూ రైతులు వరి సాగులో పంట వివిధ దశల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, పోషకాల నిర్వహణ, చీడపీడలు, తెగుళ్ల నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని తెలిపారు. సరైన సమయంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు.

డా. జి. శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూరగాయల పంటల్లో విత్తన ఎంపిక, నాటే విధానం, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, చీడపీడలు, తెగుళ్ల నివారణ తదితర అంశాలను వివరించారు. అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని తెలిపారు. రైతులు అడిగిన పలు సందేహాలకు శాస్త్రీయంగా సమాధానాలు ఇచ్చారు.

రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు, పశుగ్రాసం సాగు చేయదలచిన రైతులు తమ వివరాలను సంబంధిత క్లస్టర్ పరిధిలోని ఏఈఓల వద్ద నమోదు చేసుకోవాలని కోరారు. కూరగాయలు, పశుగ్రాసం విత్తనాలతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్లు, పందిళ్లు, మల్చింగ్ షీట్లు అవసరమైన రైతులు ముందుగానే తమ వివరాలు తెలియజేయాలని సూచించారు.

అలాగే ఒకేచోట సమూహంగా 25 ఎకరాల వరకు పంటలు సాగు చేసే రైతులకు కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన

అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, సాగు విధానాలు, నీటి వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. రైతులకు అక్కడికక్కడే తగిన సూచనలు చేశారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి లావణ్య చెన్నయ్య, ఉప సర్పంచ్ ప్రభాకర్, షాబాద్ ఎఫ్‌పీఓ సీఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓలు శివతేజ, మౌనిక, బాబ్యా నాయక్, శివకుమార్, రాజేశ్వరి, శైలజ, పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, పొలంబడి రైతు యాదవరెడ్డి, ఎరువులు, విత్తనాల డీలర్లు రాజశేఖర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, శ్రీ వెంకట్ రెడ్డి, శివరాములు, నరసింహారెడ్డి, నర్సింలు, సత్తయ్యతో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA