Sanathnagar: ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమంలో కలసిరండి: కోట నీలిమ!
Sanathnagar: ఓటరు జాబితాలో పేర్ల గల్లంతుపై అప్రమత్తంగా ఉండాలని, నవంబర్ 1న ఢిల్లీలో జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని డాక్టర్ కోట నీలిమ పిలుపునిచ్చారు.
Sanathnagar: ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమంలో కలసిరండి: కోట నీలిమ!
సనత్‌నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2025లోనే పార్టీ శ్రేణులను హెచ్చరించారని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేలా కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఏఐసీసీ సభ్యురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు.
అందరికంటే ముందుగా తాము సనత్ నగర్ నియోజకవర్గంలో లక్షకు పైగా ఇళ్లను సందర్శించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ మ్యాపింగ్ చేపట్టామని వివరించారు. ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు గల్లంతు కాకుండా పర్యవేక్షించేందుకు 100 మందికి పైగా ఎస్‌ఐఆర్ సూపర్‌వైజర్లు, బీఎల్ఏలను నియమించి క్షేత్రస్థాయిలో పని చేశామన్నారు. ఓటర్లతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ, వారి సమస్యలను గుర్తించి, ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి అప్రమత్తత అవసరమని ఆమె స్పష్టం చేశారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని అన్నారు. బీజేపీ పాలనలో అర్హులైన సామాన్యులు, పేదలు, మైనారిటీల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఓటర్ జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. ఓట్ బచావో – దేశ్ బచావో, ఓట్ చోర్ – గద్దీ ఛోడ్ నినాదాలతో ప్రజల్లోకి వెళ్తూ ఓటు హక్కు పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు కృషి చేసే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని డాక్టర్ కోట నీలిమ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ఓటు హక్కును కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు.




