Banjara Hills: హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా ‘సాధు స్వాగతం’ మహోత్సవం!
Banjara Hills: బంజారాహిల్స్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో సన్యాస దీక్ష స్వీకరించిన శ్రీ సత్య గౌర చంద్ర స్వామీజీ మహారాజ్‌కు ‘సాధు స్వాగతం’ ఘనంగా నిర్వహించారు.
Banjara Hills: హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా ‘సాధు స్వాగతం’ మహోత్సవం!
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఈరోజు పరమ పూజ్య శ్రీమాన్ సత్య గౌర చంద్ర స్వామీజీ మహారాజ్ వారి సన్యాస దీక్ష అనంతర ఆగమనం సందర్భంగా ప్రత్యేక 'సాధు స్వాగతం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
నూతనంగా సన్యాస దీక్షను స్వీకరించిన హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు పరమ పూజ్య శ్రీమాన్ సత్య గౌర చంద్ర స్వామీజీ మహారాజ్‌తో పాటు, హరే కృష్ణ మూవ్‌మెంట్ ముంబై అధ్యక్షులు పరమ పూజ్య శ్రీ అమితాసన కృష్ణ స్వామీజీ మహారాజ్, ఇస్కాన్ బెంగళూరు ఉపాధ్యక్షులు పరమ పూజ్య శ్రీధామ కృష్ణ స్వామీజీ మహారాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముగ్గురు స్వామీజీ మహారాజులు భక్తులకు తమ దివ్య ప్రవచనాలను అందించి, ఆధ్యాత్మిక సందేశాలతో భక్తులను అనుగ్రహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి, ఆశీర్వచనాలు అందించారు.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామీజీ మహారాజుల ఆశీస్సులు పొందారు. ముఖ్యంగా, స్వామీజీ మహారాజులతో ఎన్నో సంవత్సరాలుగా తమకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని, అనుభవాలను భక్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
భక్తుల జయజయధ్వానాలు, హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన మధ్య ఈ సాధు స్వాగత కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా ముగిసింది.




