Champapet: రూ.17 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు ఏడాదైనా వినియోగానికి నోచుకోలేదు!
Champapet: చంపాపేట్ ప్రభుత్వ పాఠశాలలో రూ.17 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు ఏడాదైనా వినియోగంలోకి రాకపోవడంపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Champapet: రూ.17 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు ఏడాదైనా వినియోగానికి నోచుకోలేదు!
ఎల్బీనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. చంపాపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి సమస్యలను పరిశీలించారు.
ఏడాది క్రితం రూ.17 లక్షల వ్యయంతో జీ+2 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా.. ఇప్పటికీ కుండీలు ఏర్పాటు చేయకపోవడం, నీటి సౌకర్యం కల్పించకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి పనులు పూర్తిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారితోనూ మాట్లాడి సమస్యను వివరించారు. తక్షణమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
700 మంది విద్యార్థులకు 8–9 మరుగుదొడ్లే!
పాఠశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, వారికి అందుబాటులో ఉన్న మరుగుదొడ్లు కేవలం 8 నుంచి 9 మాత్రమేనని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. మరోవైపు 32 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సైతం సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది.
విద్యార్థులకు తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు కల్పించడం ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ అధికారుల బాధ్యత అని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో ఇలాంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
ప్రకటనలు ఘనం.. క్షేత్రస్థాయిలో వసతులు శూన్యం!
ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అంతర్జాతీయ స్థాయి విద్య అంటూ ప్రభుత్వం గొప్ప ప్రకటనలు చేస్తోందని.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీస వసతుల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ సదుపాయాలు కల్పించడంలో లోపాలుంటే ప్రభుత్వ ప్రకటనలకు అర్థమేంటని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, బీఆర్ఎస్ నాయకులు ముడుపు రాజిరెడ్డి, రవి ముదిరాజ్, గండికోట శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.




