Malkajgiri: మల్కాజిగిరిలో సీఈసీ దిష్టిబొమ్మ దగ్ధం.. సీపీఐ నిరసన

Malkajgiri: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి వినాయక్ నగర్ చౌరస్తాలో సీపీఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Sept 2026 6:01 PM IST
Malkajgiri
X

Malkajgiri: మల్కాజిగిరిలో సీఈసీ దిష్టిబొమ్మ దగ్ధం.. సీపీఐ నిరసన

మల్కాజిగిరి: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మల్కాజిగిరి మండల సమితి ఆధ్వర్యంలో ఆదివారం వినాయక్ నగర్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సీపీఐ సీనియర్ నాయకుడు సిహెచ్. దశరథ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఈ ప్రక్రియలో అన్యాయంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను, ప్రజాస్వామ్య పద్ధతిలో దాని కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

సీపీఐ మల్కాజిగిరి మండల కార్యదర్శి కాసర్ల నాగరాజు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు, ప్రజలు పెద్దఎత్తున ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, సమస్య ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకే పరిమితం కాదని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపుతో పాటు ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్‌లో విభేదాలు వ్యక్తమైనట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు పి. సత్యనారాయణ, మండల సహాయ కార్యదర్శి కె. అశోక్ కుమార్, జి. వెంకటరమణ, సయ్యద్ యూసుఫ్, ఎస్‌కే అజీజ్, కే. పవన్, పి.ఎన్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri