Jawaharnagar: రాంకీ డంపింగ్ యార్డు ఎత్తివేతకై నవంబర్ 22 నుండి రిలే నిరసన దీక్షలు!
Jawaharnagar: జవహర్‌నగర్ రాంకీ డంపింగ్ యార్డు శాశ్వత తొలగింపు డిమాండ్‌తో నవంబర్ 22 నుంచి చెన్నాపురంలో రిలే నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు పోరాట కమిటీ ప్రకటించింది.
Jawaharnagar: రాంకీ డంపింగ్ యార్డు ఎత్తివేతకై నవంబర్ 22 నుండి రిలే నిరసన దీక్షలు!
మేడ్చల్ - మల్కాజిగిరి: మేడ్చల్ - మల్కాజిగిరి, కీసర సర్కిల్, జవహర్ నగర్ జి.హెచ్.ఎం.సి. పరిధిలో ప్రజలను పట్టి పీడిస్తున్న గుదిబండ రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ, 2026 నవంబర్ - 22, ఆదివారం రోజున చెన్నాపురం ఎన్.టి.ఆర్. క్రాస్ రోడ్డులో జరిగే రిలే నిరసన దీక్షలను జయప్రదం చేయాలని కోరుతూ, శుక్రవారం రోజు బాలాజీనగర్ బస్టాండ్ సెంటర్ వద్ద గల డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి అధ్యక్షతన జరిగింది.
గురువారం రోజు ప్రగతినగర్, నీలం రాంచంద్రయ్య భవన్ లో జరిగిన జేఏసి కో-కన్వీనర్ల సమావేశంలో, 15వ తేదీన వాయిదా పడిన రిలే నిరసన దీక్షలను 22వ తేదీ నుండి కొనసాగించాలని భాగస్వామ్య సంస్థలకు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు మాజీ మేయర్ మేకల కావ్య, కార్పొరేటర్ సుబ్రహ్మణ్యం, ఉపసర్పంచ్ నర్సింహ గౌడ్ సమక్షంలో తీర్మానించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత నెల రోజులుగా చలి తీవ్రత వల్ల డంపింగ్ యార్డు నుండి వెలువడే విష వాయువుల ప్రభావం పరిసర ప్రాంతాల ప్రజలపై మరింత తీవ్రమైందని తెలిపారు. చలికి గాలి కిందికి దిగడం వల్ల మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా వంటి విష వాయువులు ఇళ్ల మధ్యే ఉండిపోయి, పొగమంచుతో కలిసి ఇప్పుడున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన విషపూరిత పొగగా మారుతున్నాయని అన్నారు.
దీని వల్ల పిల్లల్లో దగ్గు, ఆయాసం, న్యుమోనియా, వృద్ధుల్లో ఆస్తమా, గుండె జబ్బులు ముదరడం, మహిళల్లో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఆస్తమా, గుండె జబ్బు ఉన్నవారికి ప్రాణాపాయం కూడా సంభవించే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రోజు రాంకీ గేటు ముందు నివాసం ఉంటున్న 14 ఏళ్ళ బాలిక మరణమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, తక్షణం ప్రజలను పట్టి పీడిస్తున్న గుదిబండ రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించేందుకు సరైన శాస్త్రీయ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
నవంబర్ - 22 నుండి జరిగే రిలే నిరసన దీక్షల్లో బాధిత ప్రాంతాల ప్రజలు, ప్రజా సంఘాలు, భాగస్వామ్య పార్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ పిలుపునిస్తుందని అన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిర్వహించే రిలే దీక్షలకు పోలీసు అధికారులు సహకరించాలని షేక్ షావలి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే రిలే దీక్షలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారితో పాటు, ఎం.పి. ఈటెల రాజేందర్, అధికార కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు కూడా తమ మద్దతును ప్రకటించి, రిలే దీక్షలకు అండగా నిలబడాలని జేఏసి కోశాధికారి ఐ.ఎఫ్.టి.యు. పి శివబాబు, కో-కన్వీనర్లు బిఎస్పీ బిర్రు యాకస్వామి, టిఆర్ఎస్ మేక లలిత యాదవ్, సిపిఐ దర్శనం యాదగిరి, సిహెచ్ దశరథ, సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ వి. ప్రవీణ్, సిపిఎం నగేష్, పిఓడబ్ల్యూ (విముక్తి) గడిపే సునీత, పిఓడబ్ల్యూ జయసుధ, డి. స్వరూప, జర్నలిస్ట్ కొన్నె వేణు, పికెఎం డి. జాన్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మహ్మద్ పాషామియా, టి. కాలేషా, బహుజన రక్షణ సమితి మహ్మద్ జావేద్, టివిఐవి మబ్బుబాలు, శ్రావణ్ కుమార్, రవీందర్ తదితరులు విజ్ఞప్తి చేసిన వారిలో ఉన్నారు.




