Shabad: నీళ్లు లేక ఎండుతున్న పంట.. ట్యాంకర్లతో నీరు పోస్తున్న రైతు!
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు రోజుకు వెయ్యి అద్దెతో ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నాడు.
Shabad: నీళ్లు లేక ఎండుతున్న పంట.. ట్యాంకర్లతో నీరు పోస్తున్న రైతు!
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం: వర్షాలు లేక.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు నానా అవస్థలు పడుతున్నాడు. పొలంలో నీరు లేక వరి పంట ఎండిపోతుండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటకు అందిస్తున్నాడు. రోజుకు రూ.1,000 అద్దె చెల్లిస్తూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈ రైతు పరిస్థితి అన్నదాతల కష్టాలకు అద్దం పడుతోంది.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రాజు సాగు చేసిన వరి పంటకు నీరు అందక ఎండిపోతుండటంతో ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వచ్చింది.
వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గిపోయి బోరుబావుల్లో నీటి మట్టం పడిపోవడంతో సకాలంలో నీరు అందడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి తోడు విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో పంటకు నీరు పెట్టలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నాడు.
గత వారం రోజులుగా రోజుకు 10 నుంచి 15 ట్యాంకర్ల నీటిని పొలానికి తరలిస్తూ పంటను బతికించుకునేందుకు శ్రమిస్తున్నట్లు రైతు తెలిపాడు. మరో 20 రోజులపాటు ఇదే విధంగా నీటిని అందిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుందని, లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పటికే అర ఎకరం వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో ఆ భూమిలో పశువులను మేపాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపాడు. ఇంతటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇతర సంబంధిత అధికారులు కానీ స్పందించలేదని రైతు వాపోయాడు. పంట సాగు చేసే సమయంలో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా వంటి సమస్యలపై రైతులకు తగిన సూచనలు అందించాలని కోరాడు.
ఇప్పటికే కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉన్నపటికీ పట్టపగలే లైట్స్ వెలుగుతున్నాయి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి
వరి పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతు రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి సకాలంలో విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, పంటలకు నీటి కొరత ఏర్పడిన ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని అంచనా వేసి తగిన సలహాలు, సూచనలు అందించాలని కోరుతున్నాడు. పంటను కాపాడుకునేందుకు రైతు పడుతున్న ఈ కష్టాలు వ్యవసాయ రంగంలో నీటి కొరత తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతు రాజు కోరుతున్నాడు.




