Turkayamjal: మునగనూరు ప్రభుత్వ భూములకు పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
Turkayamjal: తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునగనూరులో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Turkayamjal: మునగనూరు ప్రభుత్వ భూములకు పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
తుర్కయాంజల్: తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరులో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీజేపీ చేపట్టిన పోరాటం ఫలితాన్నిచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
మునగనూరులో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయాన్ని తుర్కయాంజల్ మున్సిపల్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహ రెడ్డి తన దృష్టికి తీసుకురాగా, ఈ అంశంపై స్పందించిన బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడంతో పాటు రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ నిరంతర పోరాటం నేపథ్యంలో ప్రభుత్వ భూమి చుట్టూ కొంతమేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, అయితే మిగిలిన ప్రాంతంలోనూ వెంటనే కంచె ఏర్పాటు చేసి మొత్తం 12 ఎకరాల భూమిని రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా RR Tax. ఇబ్రహీంపట్నంలో RRR Tax
రాష్ట్రవ్యాప్తంగా RR Tax కొనసాగుతుంటే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో RRR Tax నడుస్తోందని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మారవని, అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినంత మాత్రాన ఆ భూములు శాశ్వతంగా సొంతం కావని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
పేదల సంక్షేమానికి 12 ఎకరాల భూమి వినియోగించాలి
మునగనూరులోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిస్థాయిలో పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ఆ స్థలంలో ఆసుపత్రి, పార్క్‌తో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద మోడీ టవర్స్ నిర్మించి పేదలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, సొంత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన మీడియా మిత్రులకు కూడా ఇళ్ల కేటాయింపులో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల ఆస్తులు కావని, అవి ప్రజల ఆస్తులని పేర్కొంటూ, వాటిని కాపాడి పేదల సంక్షేమానికి వినియోగించడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. మునగనూరులోని 12 ఎకరాల ప్రభుత్వ భూమికి పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోసుపల్లి ప్రతాప్, పాపయ్య గౌడ్, కొత్త రామ్ రెడ్డి, బాచిగాళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, నోముల కార్తిక్ గౌడ్, తూళ్ల నరసింహ గౌడ్, కందాల బల్దేవ్ రెడ్డి, అర్జున్ గౌడ్, కరాడీ అనిల్, కొంతం బల్ రెడ్డి, అడ్వకేట్ వీణ, యంజాల శ్రీనివాస్ రెడ్డి, సామల యూసుఫ్ రెడ్డి, నందగిరి సురేష్, కొలన్ రవీందర్ రెడ్డి, ఆరేని నాగరాజు, జ్ఞానేశ్వర్ చారీ, రాజేశ్వరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




