Amangal: ఆమనగల్ 13వ వార్డు డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలి!
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ 13వ వార్డులోని డంపింగ్ యార్డును తక్షణమే జనావాసాలకు దూరంగా తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బీజేపీ నేత జంతుక శివ డిమాండ్ చేశారు.
Amangal: ఆమనగల్ 13వ వార్డు డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలి!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమనగల్ మున్సిపాలిటీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జంతుక శివ ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును ఆయన స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న తీవ్రమైన దుర్వాసనతో పాటు దోమలు, ఈగల బెడద అధికమై స్థానిక ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని, పరిసరాల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని 13వ వార్డులోని డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుంచి తొలగించి, జనావాసాలకు దూరంగా ఉన్న అనువైన ప్రాంతానికి తరలించాలని మున్సిపల్ అధికారులను జంతుక శివ డిమాండ్ చేశారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ కీలక సమస్యపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డంపింగ్ యార్డు సమస్యకు తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన స్పష్టం చేశారు.




