Abdullapurmet: ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్, సర్వేయర్!

Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

AJAY, HAYATH NAGAR
Published on: 12 Oct 2026 10:29 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్, సర్వేయర్!

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఇద్దరు రెవెన్యూ అధికారులను పట్టుకున్నారు. లేఅవుట్‌కు సంబంధించి జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నివేదిక ఇచ్చేందుకు రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఏసీబీ, సీఐయూ అధికారులకు చిక్కినట్లు సమాచారం.

సర్వే నివేదిక ఇచ్చేందుకు తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసి, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు మండల సర్వేయర్ లంచం సొమ్మును స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్ రెండు చేతుల వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం తహశీల్దార్, మండల సర్వేయర్‌ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపింది.

ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR