Shabad: యాసంగిలో వరి వద్దు.. స్వల్పకాలిక పంటలే మేలు: ఏవో!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్’ పథకం కింద కంది క్షేత్ర సందర్శన. ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సాగు వద్దని వ్యవసాయ అధికారి సూచన.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 14 Oct 2026 2:39 PM IST
Shabad
X

Shabad: యాసంగిలో వరి వద్దు.. స్వల్పకాలిక పంటలే మేలు: ఏవో!

షాబాద్: షాబాద్ మండలం, షాబాద్ గ్రామములో మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (ఎంఏఎన్‌పీ) 2026–27 పథకం కింద ఈ రోజు కందుల పంట బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్లపై శిక్షణ కార్యక్రమం, క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగినది.

ఎల్ నినో ప్రభావంతో ఈ యాసంగి (రబీ) సీజన్‌లో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశం ఉంది. అందువల్ల రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, తక్కువ నీటితో తక్కువ కాలంలో పండే పంటలను ఎంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర సూచించారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. వానాకాలంలో సరైన వర్షాలు లేనందున వరి, పత్తి విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. వానాకాలానికి ముందు నుంచే రైతులను సంసిద్ధులను చేయడంతో మండలంలో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగిందని వివరించారు.

యాసంగిలో పరిస్థితి మరింత తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయవద్దని కోరారు. అన్ని గ్రామాలలో వాస్తవ పరిస్థితులపై ఈ యాసంగిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము.

ఎల్ నినో నేపథ్యంలో ఈ యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. అలాగే మండలంలో సబ్సిడీపై శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కంది పంటల ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి పంట ఎదుగుదల, పంట పరిస్థితి, రైతులు అనుసరిస్తున్న శాస్త్రీయ సాగు పద్ధతులను పరిశీలించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పంట నిర్వహణ పద్ధతులు, కందుల ఉత్పాదకత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్ల పురోగతిని సమీక్షిస్తూ, మెరుగైన సాంకేతిక పద్ధతులను రైతులు స్వీకరించి కందుల ఉత్పత్తిని పెంచి, కంది పంటలో ఆత్మనిర్భరత సాధించే లక్ష్యానికి సహకరించాలని వ్యవసాయ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శివతేజ, రైతులు దొండ్ర ఆంజనేయులు, దొండ్ర నర్సింహులు, సూర్యప్రకాష్ రెడ్డి, శివ, కుమార్, మల్లేష్, ముద్దేం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పథకం సమర్థవంతమైన అమలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేత లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA