LB Nagar: రాజేష్ మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో పిటిషన్ దాఖలు
LB Nagar: ఎస్టీ యువకుడు రాజేష్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామని, ఈశ్వరమ్మ ఫోన్ వ్యవహారంపై విచారణ జరపాలని శివకుమార్ డిమాండ్ చేశారు.
LB Nagar: రాజేష్ మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో పిటిషన్ దాఖలు
ఎల్‌బీనగర్: ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రాజేష్ మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లో పిటిషన్ దాఖలు చేసినట్లు మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంపల్లి శివకుమార్ తెలిపారు. రాజేష్ మృతిపై స్వయంచాలకంగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని పిటిషన్‌లో కోరినట్లు వెల్లడించారు.
రాజేష్ మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వనస్థలిపురం ఏసీపీ, సంబంధిత సీఐలను కలిసి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు శివకుమార్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ వ్యవహారంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజేష్ తల్లికి ఈశ్వరమ్మ యాదవ్ ఎందుకు ఫోన్ చేశారు? ఫిర్యాదు చేయాలని ఎందుకు సూచించారు? రాజేష్ కుటుంబంతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయ నాయకురాలిగా ప్రజలకు సలహా ఇవ్వడం సాధారణమే అయినప్పటికీ.. ప్రత్యేకంగా రాజేష్ తల్లికి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంపై విచారణ జరగాలని శివకుమార్ కోరారు. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన నేపథ్యం, కారణాలను దర్యాప్తులో తేల్చాలని అన్నారు.
స్థానికంగా పలువురు రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ.. ఈశ్వరమ్మ యాదవ్ ప్రత్యేకంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించడం పలు ప్రశ్నలకు దారితీస్తోందని శివకుమార్ అన్నారు. రాజేష్ మృతికి సంబంధించిన అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.




