Quthbullapur: కోటిన్నర కరెన్సీ నోట్లతో భ్రమరాంబమ్మకు మహాలక్ష్మి అలంకారం!

Quthbullapur: కుత్బుల్లాపూర్ బౌరంపేట ఆలయంలో రూ. 1.50 కోట్ల కరెన్సీ నోట్లతో భ్రమరాంబమ్మకు మహాలక్ష్మి అలంకారం. దర్శనానికి పోటెత్తిన భక్తులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 17 Oct 2026 6:48 PM IST
Quthbullapur
X

Quthbullapur: కోటిన్నర కరెన్సీ నోట్లతో భ్రమరాంబమ్మకు మహాలక్ష్మి అలంకారం!

కుత్బుల్లాపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబాపేట (బౌరంపేట)లోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం ఏడో రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబా ఆలయంలో కొలువుదీరిన దుర్గామాతను ఆలయ కమిటీ సభ్యులు విశేషంగా అలంకరించారు.

ఏకంగా రూ.1,50,19,211 విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ విలువల నోట్లను వినియోగించి అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహాలక్ష్మి స్వరూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కరెన్సీ నోట్లతో చేసిన మహాలక్ష్మి అలంకరణ ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన విశేషంగా నిలిచింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR