Quthbullapur: జగద్గిరిగుట్టలో ఆపరేషన్ చబుత్ర: ఆకతాయిల అరెస్ట్!
Quthbullapur: కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో పోలీసులు, ఎస్‌ఓటీ సంయుక్తంగా ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరిగే ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.
Quthbullapur: జగద్గిరిగుట్టలో ఆపరేషన్ చబుత్ర: ఆకతాయిల అరెస్ట్!
Quthbullapur: రాత్రి వేళల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జగద్గిరిగుట్ట పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా గురువారం రాత్రి ‘ఆపరేషన్ చబుత్రా’ నిర్వహించారు.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పర్యవేక్షణలో స్థానిక పోలీసు సిబ్బంది, కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ ఇన్స్పెక్టర్ నరసింహ బృందం సంయుక్తంగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా రాత్రి పెట్రోలింగ్ చేపట్టింది. ఈ సందర్భంగా రాత్రి సమయాల్లో గుంపులుగా సంచరిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్న పలువురి ఆకతాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.




