Osmania University: విద్యారంగ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: పీడీఎస్యూ

Osmania University: ఉస్మానియా వర్సిటీలో జార్జిరెడ్డి పీడీఎస్యూ ద్వితీయ వార్షికోత్సవం వేళ విద్యారంగం, పర్యావరణ పరిరక్షణకు పోరాడాలని డా. ఎస్. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు.

HARISH, TARNAKA
Published on: 8 Nov 2026 5:44 PM IST
Osmania University
X

Osmania University: విద్యారంగ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: పీడీఎస్యూ

ఉస్మానియా యూనివర్సిటీ: విద్యారంగ పరిరక్షణతో పాటు ప్రకృతి సంరక్షణకు విద్యార్థి లోకం ప్రత్యేక కృషి చేయాలని జార్జిరెడ్డి PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి PDSU ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కను నాటారు.

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల లాభాపేక్ష కారణంగా ప్రకృతి విధ్వంసానికి గురవుతోందని, పర్యావరణం తీవ్ర కాలుష్యానికి లోనవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు, సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటూ ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను బలోపేతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

విద్యారంగ పరిరక్షణ కోసం జార్జిరెడ్డి PDSU రాజీలేని పోరాటాలు సాగిస్తోందని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రత్నాలు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, మారోజు వీరన్న వంటి అమరవీరుల స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగ బలోపేతం, విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో వేళ్లూనుకున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అసమానతలను తొలగించి సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం విద్యార్థులను సంఘటితం చేస్తూ పోరాటాలు కొనసాగిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జార్జిరెడ్డి PDSU ఓయూ అధ్యక్షురాలు, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కె. స్వాతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మందా సురేష్, ఓయూ నాయకులు రంజిత్ రెడ్డి, బాలకృష్ణ, నరేష్, వేణు, విద్యార్థి నాయకులు శ్రీధర్, కృష్ణ, శేఖర్, అరవింద్, వినోద్, మధు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA