Madgul: ప్రియుడు బన్నె శివతో కలిసి భర్తను కడతేర్చించిన భార్య గజ్జ అంజమ్మ!

Madgul: రూ. 18 లక్షల పరిహారం డబ్బు, వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి భర్త మల్లికార్జున్‌ను హత్య చేయించిన భార్య అంజమ్మను మాడ్గుల పోలీసులు అరెస్టు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Nov 2026 10:34 AM IST
Madgul
X

Madgul: ప్రియుడు బన్నె శివతో కలిసి భర్తను కడతేర్చించిన భార్య గజ్జ అంజమ్మ!

Madgul: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం : రూ.18 లక్షల పరిహారం డబ్బుపై కన్నేసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. అవురుపల్లి గ్రామ శివారులోని చిన్న నెమలి గుట్ట సమీపంలోని పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్య కేసును ఛేదించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బన్నె శివతో పాటు మృతుడి భార్య గజ్జ అంజమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఐ వేణుగోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మండలం ఉద్దండాపురం గ్రామానికి చెందిన గజ్జ మల్లికార్జున్ మృతదేహాన్ని ఈ నెల 23న అవురుపల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్ సయ్యద్ నబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా మృతుడి తండ్రి ఆంజనేయులు ఫొటోల ద్వారా మల్లికార్జున్‌గా గుర్తించారు.

కాల్‌డేటా, సాంకేతిక ఆధారాలు, సాక్షుల విచారణతో అవురుపల్లికి చెందిన బన్నె శివపై అనుమానం వచ్చి విచారించగా.విచారణలో గజ్జ మల్లికార్జున్‌కు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఇల్లు కోల్పోయినందుకు సుమారు రూ.18 లక్షల పరిహారం అందినట్లు వెల్లడైంది. ఆ డబ్బును కాజేయాలనే ఉద్దేశంతో బన్నె శివ, మృతుడి భార్య గజ్జ అంజమ్మ కలిసి హత్యకు పథకం రచించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ నెల 20న గజ్జ మల్లికార్జున్‌ను జడ్చర్లలోని వైన్స్‌కు పిలిపించి మద్యం తాగించిన బన్నె శివ, అనంతరం అవురుపల్లి శివారులోని చిన్న నెమలి గుట్ట వద్దకు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తెలింది.అక్కడ మద్యం మత్తులో ఉన్న గజ్జ మల్లికార్జున్‌పై బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పొదల్లో పడవేసి, అతని ఫోన్, ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి పరారయ్యారని సి ఐ తెలిపారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు రోజులలో నిందితులైన బన్నె శివ, మృతుని భార్య గజ్జ అంజమ్మలను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సి ఐ వెల్లడించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY