Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు!
Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత నాకాబందీ తనిఖీలు నిర్వహించారు.
Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు!
Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నేర నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా నాకాబందీ మరియు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ప్రధాన రహదారులు, కూడళ్లు మరియు ముఖ్యమైన ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాహనదారుల పత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు.
ఈ సందర్భంగా మొత్తం 1,287 వాహనాలను తనిఖీ చేశారు. వీటిలో 610 ద్విచక్ర వాహనాలు, 218 త్రిచక్ర వాహనాలు, 296 నాలుగు చక్రాల వాహనాలు, 163 భారీ వాహనాలు ఉన్నాయి. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూ 120 ఈ-పెట్టీ కేసులు, 83 డీడీ కేసులు నమోదు చేశారు.
అదేవిధంగా 272 ఈ-చలాన్లు జారీ చేసి మొత్తం రూ.98,730 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.
నాకాబందీ వంటి ప్రత్యేక తనిఖీల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాలను ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు స్పష్టం చేశారు.
ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, నేరరహిత మరియు సురక్షిత వికారాబాద్ జిల్లాకు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.




