Quthbullapur: వరుస దొంగతనాలకు చెక్.. నలుగురు అరెస్ట్, రూ.64.50 లక్షల సొత్తు రికవరీ!

Quthbullapur: మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 Nov 2026 12:25 PM IST
Quthbullapur
X

Quthbullapur: వరుస దొంగతనాలకు చెక్.. నలుగురు అరెస్ట్, రూ.64.50 లక్షల సొత్తు రికవరీ!

Quthbullapur: దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న నిందితుల ఆట కట్టించారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన పలు చోరీ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి, నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ట్రాక్టర్లు, హిటాచీ ఎక్స్‌కవేటర్, ద్విచక్రవాహనాలు సహా మొత్తం రూ.64.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ల ఇంజిన్లు, ట్రాలీల దొంగతనాలకు పాల్పడుతున్న బత్తుల రామచంద్ర అలియాస్ నానీని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి మహీంద్రా ట్రాక్టర్, రెండు ట్రాక్టర్ ట్రాలీలు, జాన్ డీర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ట్రాక్టర్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందినదిగా గుర్తించారు.

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.45 లక్షల విలువైన హిటాచీ 210 ఎక్స్‌కవేటర్‌తో పాటు ద్విచక్రవాహనాన్ని అపహరించిన కేసులో మహారాష్ట్రకు చెందిన విజయ్ రాజేంద్ర హెగ్డే అలియాస్ సచిన్ (21)ను అరెస్టు చేశారు. ఇటీవలే డ్రైవర్‌గా చేరిన అతడు ఈ చోరీకి పాల్పడ్డాడు.

మరో బైక్ చోరీ కేసులో నీరెడ్‌మెట్‌కు చెందిన బ్యాండ్ ఆపరేటర్ శివలాల్ (21), రామకృష్ణాపురానికి చెందిన ఆటో డ్రైవర్ మహేశ్ (19)ను అరెస్టు చేశారు. మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసై, విలాసవంతమైన జీవనం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి హీరో స్ప్లెండర్ బైక్, యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్వాధీనం చేసుకున్నారు.

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ద్విచక్రవాహనాల చోరీ కేసులో ప్రగతినగర్‌కు చెందిన మెకానిక్ మీశాల లక్ష్మణరావు (47)ను అరెస్టు చేశారు. అతడి నుంచి మూడు హోండా యాక్టివాలు, ఒక హీరో గ్లామర్, ఒక ప్యాషన్ ప్లస్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్టప్రకారం విచారణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, చట్టప్రకారం విచారణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్లు మేడ్చల్ డివిజన్ ఏసీపీ శంకర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ బాల గంగిరెడ్డి పర్యవేక్షణలో జరిగాయి. పేట్ బషీరాబాద్, బాచుపల్లి, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, క్రైమ్ సిబ్బంది సమన్వయంతో చాకచక్యంగా కేసులను ఛేదించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR