Kalvakuntla Kavitha: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కవిత తీవ్ర ఆగ్రహం!
Kalvakuntla Kavitha: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Kalvakuntla Kavitha: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై కవిత తీవ్ర ఆగ్రహం!
Kalvakuntla Kavitha: పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పటం ద్వారా తెలంగాణ నీటి ప్రయోజనాలను రేవంత్ సర్కార్ ఏపీకి తాకట్టు పెడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన 250 టీఎంసీల నీళ్ల వాటాను తన గురువు చంద్రబాబుకు గురుదక్షణగా రేవంత్ రెడ్డి సమర్పించుకుంటున్నాడని విమర్శించారు.
ఎన్ డబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించటం వారి ద్వంద్వ విధానాలను తెలియజేస్తోందంటూ బుధవారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. గోదావరి - కావేరి నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని కూడా ఎన్ డబ్ల్యూడీఏ సమావేశాల్లో అధికారులు కోరారని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుగుణంగా నదుల అనుసంధానం జరిగేలా రేవంత్ సహకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే కాకుండా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పారన్నారు. కానీ మీడియా ముందు మాత్రం బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నట్లు పచ్చి అబద్దాలు ఆడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ముందే హెచ్చరించాం
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుందని మొట్ట మొదట ప్రభుత్వాన్ని హెచ్చరించింది తామేనని కవిత గుర్తు చేశారు. 2024లోనే ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేశామన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం సోయి లేకుండా పోయిందని విమర్శించారు. ఓవైపు బనకచర్ల ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నామంటూనే లోలోపల సహకరిస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి నీళ్ల వినియోగం పై కనీస అవగాహన లేదన్న విషయం అర్థమవుతుందన్నారు. నది జలాల వినియోగంపై ప్రభుత్వానికి ఇసుమంతైనా అవగాహన లేకపోవటం, నిర్ధిష్టమైన విధానం లేకపోవటం తెలంగాణకు శాపంగా మారిందన్నారు.
ఇకనైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పు వాటిల్లుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి మనకు జరిగే నష్టాన్ని గుర్తుంచాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ పై కేంద్రం చేపట్టిన అన్ని సంప్రదింపుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాయాలని కోరారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు.




