Pocharam: పోచారంలో ఇన్ఫోసిస్ నూతన క్యాంపస్ ప్రారంభం
Pocharam: పోచారంలో ఇన్ఫోసిస్ నూతన క్యాంపస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. తొలిదశలో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Pocharam: పోచారంలో ఇన్ఫోసిస్ నూతన క్యాంపస్ ప్రారంభం
పోచారం: తూర్పు హైదరాబాద్ ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారంలోని ఇన్ఫోసిస్ ప్రాంగణంలో సంస్థ నిర్మించిన నూతన క్యాంపస్ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు.
10 వేల మందికి కొలువులు
సుమారు 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన భవనంలో తొలిదశలో 10 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా సదుపాయాలు కల్పించారు. హైబ్రిడ్ పని విధానంలో మరో 13 వేల మందికి పైగా ఉద్యోగులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో సంస్థ ముందుకెళ్తోంది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, ఇంజినీరింగ్, తదుపరి తరం డిజిటల్ సేవల విభాగాల్లో ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించనుంది.
450 ఎకరాల్లో ఇన్ఫోసిస్ ప్రాంగణం
ఇప్పటికే పోచారంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ ప్రాంగణం సుమారు 450 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 4.58 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి భవనాలు ఉన్నాయి. తాజాగా నూతన భవనం అందుబాటులోకి రావడంతో సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రిటైల్, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లోని అంతర్జాతీయ సంస్థలకు ఈ కేంద్రం సేవలందిస్తోంది.
తూర్పు హైదరాబాద్‌కు ఐటీ ఊతం
కొత్త భవనంలో పునరుత్పాదక ఇంధన వినియోగం, స్మార్ట్ లైటింగ్, నీటి పునర్వినియోగం, మురుగునీటి శుద్ధి వంటి ఆధునిక సదుపాయాలు కల్పించారు. క్యాంపస్ విస్తరణతో పోచారం, ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో ఐటీ కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు రవాణా, ఆహార, వాణిజ్య రంగాల్లోనూ అవకాశాలు పెరగనున్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పనతో పాటు తూర్పు హైదరాబాద్ అభివృద్ధికి ఈ కేంద్రం దోహదపడనుంది.




