Pargi: వినాయక నిమజ్జనంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

Pargi: పరిగిలో గొడవ ఆపుతున్న కానిస్టేబుల్‌పై కత్తితో దాడి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను పరామర్శించిన ఎస్పీ స్నేహ మెహ్రా.

WAZID, PARIGI
Published on: 26 Sept 2026 4:36 PM IST
Pargi
X

Pargi: వినాయక నిమజ్జనంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

పరిగి: పరిగి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి అనంతరం తెల్లవారుజామున సుమారు 4:00 గంటల సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా, పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నర్సింలు గొడవను అదుపు చేసేందుకు మధ్యలోకి వెళ్లారు. ఈ సమయంలో గొడవలో పాల్గొన్న తరుణ్ అనే వ్యక్తి కత్తితో కానిస్టేబుల్ నర్సింలుపై దాడి చేసి కడుపులో గాయపరిచాడు.

సంఘటన జరిగిన వెంటనే పరిగి ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ అధికారులు స్పందించి గాయపడిన కానిస్టేబుల్ నర్సింలును పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కాంటినెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ నర్సింలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హైదరాబాద్‌కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నర్సింలును పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ ఘటనపై పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఎస్పీ హెచ్చరిక

“పోలీసు సిబ్బంది ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేయడం, బెదిరించడం లేదా విధులకు ఆటంకం కలిగించడం ఎంతమాత్రం సహించేది లేదు. పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితులపై రౌడీ షీట్ ప్రారంభించడం జరుగుతుంది. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు చేపడతాం.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా గొడవలకు పాల్పడటం, ఆయుధాలతో తిరగడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం లేదా పోలీసు సిబ్బందిపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవు.” అని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు.

WAZID, PARIGI

WAZID, PARIGI