LB Nagar: ఎల్బీనగర్లో ఘనంగా పండుగోళ్ళ సాయన్న 174వ జయంతి వేడుకలు!
LB Nagar: ఎల్బీనగర్లో ఘనంగా పండుగోళ్ళ సాయన్న 174వ జయంతి. ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, పాఠ్యాంశాల్లో చేర్చాలని సీతా మహాలక్ష్మి డిమాండ్.
LB Nagar: ఎల్బీనగర్లో ఘనంగా పండుగోళ్ళ సాయన్న 174వ జయంతి వేడుకలు!
LB Nagar: తెలంగాణ ప్రాంతంలో పేదలు, అణగారిన వర్గాల కోసం పోరాడిన ప్రజావీరుడు పండుగోళ్ల సాయన్న 174వ జయంతి వేడుకలను ఎల్బీనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లింగన్న బోయిన సీతా మహాలక్ష్మి ముదిరాజ్ పాల్గొని సాయన్నకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలమూరు ప్రాంతంలో సంపన్న భూస్వాములు, దొరలు, దేశ్‌ముఖ్‌ల దోపిడీని ఎదిరిస్తూ పేదలకు అండగా నిలిచిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు. తన బాహుబలం, కండబలంతో పాటు ప్రజల పక్షాన నిలిచే ధైర్యసాహసాలతో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కరువు కాటకాల సమయంలో పేదల కష్టాలను చూసి చలించి, ప్రజా సైన్యాన్ని నిర్మించి అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ప్రజావీరుడిగా సాయన్న చరిత్రలో గుర్తింపు పొందారని అన్నారు. పేదల పక్షాన పోరాడిన ఆయనను ప్రజలు తెలంగాణ రాబిన్‌హుడ్‌గా గుర్తిస్తారని తెలిపారు.
ప్రభుత్వం సాయన్నకు తగిన గుర్తింపు ఇవ్వాలి
తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు సముచిత స్థానం కల్పించాలని సీతా మహాలక్ష్మి ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండుగోళ్ళ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సాయన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ముదిరాజ్ కులాన్ని ప్రస్తుత డీ కేటగిరీ నుంచి ఏ కేటగిరీలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
పండుగోళ్ళ సాయన్న త్యాగాలు, పోరాటాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఆయనకు చారిత్రక గుర్తింపు కల్పించేందుకు సంఘాలన్నీ ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్బీనగర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు గుంటి కురుమూర్తి ముదిరాజ్, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్, బీసీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గద్దె రత్నకుమారి ముదిరాజ్, ఎల్బీనగర్ విగ్రహ కమిటీ గౌరవ అధ్యక్షులు మాసుల నర్సింగ్ రావు ముదిరాజ్, బోయపల్లి లింగస్వామి గౌడ్, కమిటీ కార్యదర్శి సందుల కృష్ణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




