Uppal: ఉప్పల్ ఎన్‌జీఆర్‌ఐలో ఘనంగా ఓపెన్‌డే ఆకట్టుకున్న శాస్త్ర ప్రదర్శనలు!

Uppal: ఉప్పల్ ఎన్‌జీఆర్‌ఐలో ఘనంగా నిర్వహించిన ఓపెన్‌డే వేడుకలకు 5 వేల మందికి పైగా విద్యార్థులు హాజరై, శాస్త్ర విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 26 Sept 2026 6:14 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్ ఎన్‌జీఆర్‌ఐలో ఘనంగా ఓపెన్‌డే ఆకట్టుకున్న శాస్త్ర ప్రదర్శనలు!

Uppal: సీఎస్‌ఐఆర్‌ 85వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ ఉప్పల్‌ రోడ్డులోని సీఎస్‌ఐఆర్‌–నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో శనివారం ఓపెన్‌డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో, ఫౌండేషన్‌ డే కమిటీ చైర్మన్‌, సైంటిస్ట్‌ జీ డాక్టర్‌ బి.పి.కె. పట్రో సమన్వయంతో జరిగిన కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు కలిపి సుమారు 5 వేల మంది హాజరయ్యారు.

ఎన్‌జీఆర్‌ఐలోని పరిశోధనశాలలు, పరిశీలనా కేంద్రాలను సందర్శించే అవకాశం కల్పించారు. సుమారు 20 ప్రత్యేక ప్రదర్శనశాలల్లో భూకంపాలు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులు, భూ అయస్కాంత శాస్త్రం, శిలల అధ్యయనం తదితర అంశాలను నమూనాలు, పనిచేసే నమూనాలు, ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు వివరించారు. భూకంపాలు ఎలా సంభవిస్తాయి, భూమి అంతర్భాగంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి, భూమి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి వంటి అంశాలను విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు.

భూకంపాల నమోదు, భూగర్భ జలాల అన్వేషణ, ఖనిజ వనరుల గుర్తింపు తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాగ్నెటోటెల్యూరిక్‌ సాంకేతికతపై 3డీ ప్రదర్శన, మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉపయోగించే రాళ్లు, ఖనిజాలపై ఏర్పాటు చేసిన నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భూమి ఆవిర్భావం పరిణామం, నేపాల్‌ వరదలకు సంబంధించిన సహజ ప్రక్రియలు, భూకంపాలను గుర్తించి హెచ్చరికలు అందించే మొబైల్‌ యాప్‌పై కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అంటార్కిటికా పరిశోధనలపై ‘మిరాకిల్‌ ఇన్‌ అంటార్కిటికా’ వీడియోను ప్రదర్శించారు. ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 26న సీఎస్‌ఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడం, శాస్త్రీయ అవగాహన కల్పించడం, భవిష్యత్తులో వారు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించడమే ఓపెన్‌డే ఉద్దేశమన్నారు. పరిశోధనశాలలను సందర్శించిన విద్యార్థులు శాస్త్రవేత్తలను పలు ప్రశ్నలు అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సైన్స్‌ను పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడంతో విద్యార్థులు ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైన్స్‌ క్విజ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌జీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్టులు శ్రీనివాస్‌ శర్మ, దేవేందర్‌ కుమార్‌, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ విజయ్ కుమార్, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL