Hyderabad: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

Hyderabad: జెన్ జీ ఉద్యమకారుల అరెస్టులను నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ జేఏసీ ర్యాలీ. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.

HARISH, TARNAKA
Published on: 10 Oct 2026 7:17 PM IST
Hyderabad
X

Hyderabad: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

హైదరాబాద్‌: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ఓయూ జేఏసీ, తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. జెన్‌ జీ ఉద్యమకారుల అరెస్టులను నిరసిస్తూ శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి రాజ్యాంగ, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని సైతం దుర్వినియోగం చేస్తూ, ప్రజల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును తొలగించే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తమకు అనుకూలంగా లేని వర్గాల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ఓటు హక్కు పౌరుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న యువత, విద్యార్థి సంఘాల నాయకులు, జెన్‌ జీ ఉద్యమకారులను అణచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు రవీందర్‌ నాయక్‌ గాదె, వెంకట్‌, వీరబాబు, స్వామిగౌడ్‌, వలిగొండ నరసింహ, రవి, సురేష్‌ నాయక్‌, నీరంటి విజయ్‌, కొల్లూరి వెంకటేష్‌, క్రాంతి, భూక్య భాస్కర్‌, కాశి, కొమ్మనబోయిన సైదులు యాదవ్‌, నామా సైదులు తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA