Hyderabad: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ రద్దు చేయాలి!

Hyderabad: 2023 కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను పూర్తిగా రద్దు చేసి, సీబీఐ లేదా న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఓయూ, నిరుద్యోగ జేఏసీ డిమాండ్.

HARISH, TARNAKA
Published on: 6 Oct 2026 4:50 PM IST
Hyderabad
X

Hyderabad: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ రద్దు చేయాలి!

Hyderabad: 2023లో చేపట్టిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, కొత్తగా జూనియర్ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఓయూ జేఏసీ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేశాయి. క్రమబద్ధీకరణలో అక్రమాలు, అవినీతి జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో పాటు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిపించాలని కోరాయి.

ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన సమావేశంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా క్రమబద్ధీకరణ పొందినట్లు గుర్తించిన 35 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను ఇంటర్మీడియట్ బోర్డు సర్వీసు నుంచి తొలగించడాన్ని వారు స్వాగతించారు. అయితే, ఇలాంటి పద్ధతుల్లో క్రమబద్ధీకరణ పొందిన వారందరిపైనా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గెజిటెడ్ స్థాయి పోస్టులను ఎలాంటి పోటీ పరీక్ష నిర్వహించకుండా క్రమబద్ధీకరించడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నాయకులు ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల వ్యవహారంపై తాజాగా 35 మంది లెక్చరర్లను తొలగించిన ఘటనతో క్రమబద్ధీకరణ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఈ అంశంపై తక్షణమే స్పందించి మొత్తం క్రమబద్ధీకరణ ప్రక్రియపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. కేవలం 35 మందిని తొలగించి చేతులు దులుపుకోకుండా, ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ప్రయోజనం పొందిన వారందరిపై నిర్దిష్ట గడువులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిన అధికారులపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పేద, గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడకూడదని నాయకులు సూచించారు. అర్హత లేని వారిని కీలక బోధనా పోస్టుల్లో కొనసాగించడం వల్ల విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తం క్రమబద్ధీకరణ ప్రక్రియను రద్దు చేసి, పారదర్శకంగా కొత్త జూనియర్ లెక్చరర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు డా. ఎస్. నాగేశ్వరరావు, ఓయూ శంకర్, ఉదయ్, అజయ్, మహేష్, వేదాంత మౌర్య, కిరణ్, రంజిత్, మనోజ్, విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA