Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన ఉచిత విద్య అమలుకు డిమాండ్
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఉచిత విద్య, భోజనం అందించాలని కోరుతూ విద్యార్థులు నిరసన తెలిపారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసన ఉచిత విద్య అమలుకు డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సేన ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యువజన సేన అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, భోజనం అందిస్తున్నప్పుడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు కూడా ఉచిత విద్య, భోజనం అందించాలని కోరారు. పీజీ, పీహెచ్‌డీ, ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు అధిక ఫీజుల భారం పడుతోందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సౌకర్యాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు జయంత్ నాయక్, సంజన, రోహిత్, ఓంకార్, దిల్షా, పాషా, అనీష్, కార్తీక్, నందిత తదితరులు పాల్గొన్నారు.




