Hyderabad: పేదరికం నుంచి పీహెచ్డీ వరకు.. జంగిలి దర్శన్ స్ఫూర్తి ప్రస్థానం!
Hyderabad: రంగారెడ్డి జిల్లా కప్పపహాడ్ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుమారుడు జంగిలి దర్శన్ కష్టాలను అధిగమించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ సాధించారు.
Hyderabad: పేదరికం నుంచి పీహెచ్డీ వరకు.. జంగిలి దర్శన్ స్ఫూర్తి ప్రస్థానం!
హైదరాబాద్: పేదరికం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సవాళ్లను అధిగమించి చదువునే ఆయుధంగా, సామాజిక ఉద్యమాన్నే మార్గంగా ఎంచుకున్న జంగిలి దర్శన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డాక్టరేట్ సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామానికి చెందిన దర్శన్ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించారు. పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ అందించిన ప్రోత్సాహంతో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. తండ్రి జంగిలి మైసయ్య గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే సంకల్పంతో అండగా నిలిచారు.
గ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన దర్శన్, ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ చదివి కళాశాల ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, ప్రాచ్యభాషల విభాగం తెలుగు శాఖలో పరిశోధన కొనసాగించారు.
విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై స్పందిస్తూ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనల ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం పట్ల అవగాహన పెంచుకున్నారు. 2011 తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజాం కళాశాలలో దళిత్ బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (డీబీఎస్ఏ) కళాశాల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టల్ సౌకర్యాలు, విద్యార్థుల హక్కుల కోసం పోరాడారు.
డా. నలిగంటి శరత్ చమార్ ప్రోత్సాహంతో దళిత బహుజన విద్యార్థి ఉద్యమంలో మరింత చురుకుగా పనిచేశారు. గత 15 ఏళ్లుగా విద్యార్థుల హక్కులు, విద్యా అవకాశాలు, సామాజిక న్యాయం కోసం పోరాడుతూ ప్రస్తుతం డీబీఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూలే, అంబేడ్కర్, కాన్షీరాం ఆశయాల సాధన, బహుజన విద్యార్థుల ఐక్యత, సామాజిక చైతన్యం, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డా. కె. చంద్రశేఖర రావు పర్యవేక్షణలో ఆచార్య కొలకలూరి ఇనాక్ నవలలు – సమగ్ర అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించారు. ఈ పరిశోధనలో ఇనాక్ నవలల్లోని సామాజిక అంశాలు, దళిత జీవితాలు, మహిళల సమస్యలు, పాత్రల చిత్రణ, భాషా వైవిధ్యం, మానవీయ విలువలను సమగ్రంగా విశ్లేషించారు.
కుటుంబ బాధ్యతలు, తండ్రి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఉద్యమాలతో పాటు పరిశోధనను కొనసాగించి డాక్టరేట్ సాధించడం విశేషం. తన విజయానికి తల్లిదండ్రులు జంగిలి మైసమ్మ, జంగిలి మైసయ్యల త్యాగం, కృషి, ప్రోత్సాహమే ప్రధాన కారణమని పేర్కొంటూ పీహెచ్డీ డాక్టరేట్‌ను వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, గురువులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యమ సహచరులు, విద్యార్థి సంఘాల నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
పేదరికం లక్ష్యానికి అడ్డుకాదని, పట్టుదలతో కష్టాలను అధిగమించవచ్చని జంగిలి దర్శన్ నిరూపించారు. చదువును ఆయుధంగా మలుచుకొని, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తూ పీహెచ్డీ సాధించిన ఆయన ప్రస్థానం విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.




