Old Rupee Scam: పాత రూపాయి నోటుకు రూ.45 లక్షల ఆఫర్.. చివరికి రూ.7.93 లక్షలు కాజేశారు!
Old Rupee Scam: పాత ఒక్క రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇస్తామంటూ హైదరాబాద్‌లో వ్యక్తిని మోసం చేసి రూ.7.93 లక్షలు కాజేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Old Rupee Scam: పాత రూపాయి నోటుకు రూ.45 లక్షల ఆఫర్.. చివరికి రూ.7.93 లక్షలు కాజేశారు!
Hyderabad Old Rupee Scam: మీ దగ్గర పాత ఒక్క రూపాయి నోటు ఉందా? దానికి ఏకంగా రూ.45 లక్షలు ఇస్తామంటూ ఎవరైనా ఆఫర్ చేస్తే నమ్మకండి. హైదరాబాద్‌లో ఇలాంటి ఆఫర్‌తో ఓ వ్యక్తిని నమ్మించి భారీగా డబ్బులు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాత ఒక్క రూపాయి నోటుకు రూ.45 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్ ద్వారా బాధితుడిని సంప్రదించిన ఇద్దరు వ్యక్తులు, విడతలవారీగా అతడి నుంచి రూ.7,93,351 దోచుకున్నారు.
ఈ ఘటనపై బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో రామాంతపూర్‌కు చెందిన గుమ్మ రమేష్ (39), ముదలే అనిల్ (19) ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అమాయకుల బ్యాంక్ ఖాతాలే టార్గెట్
పోలీసుల దర్యాప్తులో నిందితుల సైబర్ నేరాల వెనుక మరో పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు బయటపడింది. గతంలో ర్యాపిడో, ఉబర్ సంస్థల్లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసిన రమేష్.. రామాంతపూర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, డెలివరీ బాయ్స్, ఇతర అమాయకులను టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు.
కమీషన్లు ఇప్పిస్తామని నమ్మించి వారి బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డులను తీసుకునేవాడు. ఇలా సుమారు 60 నుంచి 70 మంది నుంచి బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, సిమ్ కార్డులను సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వీటిని కొరియర్ ద్వారా హర్యానాలోని సైబర్ నేరగాళ్లకు పంపినట్లు పోలీసులు గుర్తించారు.
మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించి.. కోట్లలో లావాదేవీలు
నిందితులు అందించిన బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు ‘మ్యూల్ అకౌంట్లు’ గా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి కాజేసిన డబ్బును ఈ ఖాతాల్లోకి బదిలీ చేసి, అక్కడి నుంచి ఇతర ఖాతాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది.
నిందితులు విక్రయించిన బ్యాంక్ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 450 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
పాత నోట్ల పేరుతో వచ్చే ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి
పాత కరెన్సీ నోట్లు, నాణేలకు భారీ ధరలు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు పంపవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ట్యాక్స్ లేదా ఇతర పేర్లతో డబ్బులు అడిగితే మరింత జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఇతరులకు కమీషన్ వస్తుందని చెప్పి మీ బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు లేదా సిమ్ కార్డును ఇవ్వడం కూడా ప్రమాదకరమే. మీ ఖాతా సైబర్ మోసాలకు ఉపయోగిస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఇలాంటి ఆఫర్లకు దూరంగా ఉండటం మంచిది.




