Khairatabad: రైతులకు కరువు సాయం లేదు.. సమ్మిట్‌లకు కోట్లా?: మన్నె గోవర్ధన్ రెడ్డి

Khairatabad: రైతులకు కరువు సాయం ఇవ్వకుండా గ్లోబల్ సమ్మిట్ల ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఖైరతాబాద్ బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

RAJESH,	WEST ZONE
Published on: 6 Nov 2026 5:48 PM IST
Khairatabad
X

Khairatabad: రైతులకు కరువు సాయం లేదు.. సమ్మిట్‌లకు కోట్లా?: మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించడంపై ఉన్న శ్రద్ధ రైతుల కష్టాలను పట్టించుకోవడంలో లేదని విమర్శించారు. మూడు రోజుల పాటు సమ్మిట్‌ల కోసం సమయం కేటాయించే ముఖ్యమంత్రికి ఎండిపోయిన పంట పొలాలను సందర్శించి రైతులను పరామర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.

నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనైనా కరువు పరిస్థితులపై చర్చించారా? రైతుల సమస్యలపై మంత్రులకు కనీస బాధ్యత లేదా? విందులు, వినోదాలే ముఖ్యమా? ప్రజల కష్టాల కంటే కమీషన్లకే కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని, మంత్రులు ఏసీ గదులు వదిలి ప్రజల్లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రచారం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, రైతులకు పరిహారం ఇవ్వలేని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని నిలదీశారు.

కేంద్రం నిధులు ఇస్తేనే రైతులకు సాయం చేస్తామనడం సిగ్గుచేటని, రాష్ట్ర బడ్జెట్, వ్యవసాయ శాఖ, మంత్రివర్గం ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. కరువు పరిహారంగా ఎకరాకు రూ.10 వేలతో సరిపెట్టకుండా కనీసం రూ.30 వేలు అందించాలని డిమాండ్ చేశారు.

గత ఖరీఫ్‌లో 69.19 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి కేవలం 57.04 లక్షల ఎకరాలకే పరిమితమైందని, సాగు విస్తీర్ణం దాదాపు 17.6 శాతం తగ్గడం రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.

డిసెంబర్‌లో మేడిగడ్డ మరమ్మతులు చేపడతామని చెబుతున్నారని, ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కరువుపై అసెంబ్లీలో చర్చిస్తామనడం వల్ల రైతుల పొలాలకు నీళ్లు వస్తాయా? మోటార్లు ఆన్ అవుతాయా? ఎండిపోతున్న పంటలు బతుకుతాయా? అని నిలదీశారు. అసెంబ్లీలో చర్చల కంటే రెండు రోజుల పాటు పల్లెల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని సూచించారు.

రైతులకు పరిహారం అందించలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఘోరంగా ఓడించి, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనకు గట్టి గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE