Shabad: షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన MDMA డ్రగ్స్ పట్టివేత!

Shabad: షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న చేవెళ్ల జోన్ ఎస్‌వోటీ, షాబాద్ పోలీసులు. ఇద్దరు నిందితుల అరెస్ట్.. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తింపు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Oct 2026 12:19 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో రూ.2 లక్షల విలువైన MDMA డ్రగ్స్ పట్టివేత!

Shabad: యువతను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. షాబాద్‌లో MDMA డ్రగ్స్‌ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చేవెళ్ల జోన్‌ SOT, షాబాద్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 13.97 గ్రాముల MDMA, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ సుమారు రూ.2 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

రహస్య ఆపరేషన్‌తో పట్టివేత

ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి ఆదేశాల మేరకు, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ జహంగీర్‌ మార్గదర్శకత్వంలో ఈ ఆపరేషన్‌ చేపట్టారు. షాబాద్‌లోని నాగరకుంట చౌరస్తా సమీపంలోని టీ-టైమ్‌ వద్ద విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మీర్జాగూడలోని ఇంద్రారెడ్డి నగర్‌ కాలనీకి చెందిన మారమ్‌ వంశీ రెడ్డి (23), బీరా ప్రవీణ్‌ కుమార్‌ (28)గా గుర్తించారు.

గ్రాముకు రూ.3 వేల చొప్పున కొనుగోలు

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, బెంగళూరుకు చెందిన స్టీఫెన్‌ అనే వ్యక్తి నుంచి సుమారు 14 గ్రాముల MDMAను గ్రాముకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.42 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. మొకిల, కోకాపేట, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లోని విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు విక్రయించేందుకు డ్రగ్స్‌ తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో స్టీఫెన్‌ పాత్రపై దర్యాప్తు కొనసాగుతుండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

NDPS చట్టం కింద కేసు నమోదు

నిందితుల నుంచి రెండు రెడ్‌మి మొబైల్‌ ఫోన్లు, ఒక కీప్యాడ్‌ ఫోన్‌తో పాటు MDMAను స్వాధీనం చేసుకున్నారు. NDPS చట్టం, 1985లోని సెక్షన్‌ 8(c) రెడ్‌విత్‌ 22(c) కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA