LB Nagar: నాగోల్‌లో ఇద్దరు చిన్నారలు అదృశ్యం.. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు!
LB Nagar: ఎల్బీనగర్ నాగోల్‌లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం. మూడు రోజులైనా లభించని వరుణ్ తేజ్, మహేష్ ఆచూకీ. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు.
LB Nagar: నాగోల్‌లో ఇద్దరు చిన్నారలు అదృశ్యం.. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు!
ఎల్బీనగర్: నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అన్నదమ్ములైన ఎనిమిదేళ్ల వరుణ్ తేజ్, ఆరేళ్ల మహేష్ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులు గడిచినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో నాగోల్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే ఒంగోలు నుంచి వలస వచ్చి ఎనిమిదేళ్లుగా నాగోల్‌లో నివసిస్తున్న శిరీష, రవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వరుసగా నాలుగు, రెండో తరగతి చదువుతున్నారు. అక్టోబరు 31న ఉదయం తల్లి పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. పాఠశాలకు వెళ్లాలని తల్లి సూచించడంతో వారు నిరాకరించారు. దీంతో పాఠశాల బ్యాగులు తీసుకొచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లిన సమయంలో ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు.
పాఠశాలకు వెళ్లలేదని నిర్ధారణ
చిన్నారులు పాఠశాలకు వెళ్లి ఉంటారని భావించిన తల్లి అక్కడికి వెళ్లి ఉపాధ్యాయులను విచారించగా.. ఆ రోజు వారు పాఠశాలకు రాలేదని తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చిన్నారుల వివరాలు సేకరించి వివిధ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
పోలీసుల విజ్ఞప్తి
ఈ ఘటనపై నాగోల్ సీఐ మక్బూల్ జానీ మాట్లాడుతూ.. ఇద్దరు చిన్నారులు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. వరుణ్ తేజ్, మహేష్ ఆచూకీ తెలిసిన వారు నాగోల్ పోలీసులకు లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.




