Miyapur: 20 ఏళ్ల నాటి పాత మాస్టర్ ప్లాన్ రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్!
Miyapur: మియాపూర్లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ లక్ష సంతకాల సేకరణ చేపట్టింది. పాత మాస్టర్ ప్లాన్ రోడ్డును పునరుద్ధరించాలని కోరింది.
Miyapur: 20 ఏళ్ల నాటి పాత మాస్టర్ ప్లాన్ రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్!
Miyapur: 20 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ రోడ్డును పునరుద్ధరించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ డిమాండ్మియాపూర్ పరిధిలోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ, ట్రాఫిక్ రద్దీ నివారణకు పాత మాస్టర్ ప్లాన్ రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ .చేస్తూ శుక్రవారం బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆధ్వర్యంలో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మియాపూర్లోని ఎం.ఏ. నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంతి నగర్, పి.ఏ. నగర్ ప్రాంతాలలో విస్తరించి ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ స్టాలిన్ నగర్లో 'లక్ష సంతకాల ప్రజాభిప్రాయ సేకరణ' చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విలువైన ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకే ఈ భూమి చెందాలని, జీవో నంబర్ 58 ప్రకారం అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భూమిని అమ్మకుండా స్థానికుల అవసరాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, విద్యా సంస్థలు, పార్కులను నిర్మించాలని కోరారు.అంతకుముందు మియాపూర్ ఎక్స్ రోడ్లోని శ్రీ చైతన్య కళాశాల పరిసరాల్లో నేతలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ట్రాఫిక్ సమస్యలపై మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రస్తుత 2025 రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (RDP) అమలు చేస్తే 132 ఆస్తులు, పలు ఆలయాలు కూల్చివేతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వాహనదారులకు సుమారు రూ. 400 కోట్ల మేర ఇంధన నష్టం వాటిల్లుతుందని తెలిపారు.
దీనికి ప్రత్యామ్నాయంగా 20 ఏళ్ల నాటి పాత మాస్టర్ ప్లాన్ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. బొల్లారం నుండి మియాపూర్ జంక్షన్, చైతన్య కళాశాల అండర్పాస్ మీదుగా మాతృశ్రీ నగర్ పక్కనుండి హఫీజ్పేట్కు నేరుగా 1.4 కి.మీ. రోడ్డు నిర్మిస్తే ఆస్తులకు నష్టం కలగకపోగా, ప్రభుత్వానికి రూ. 100 నుండి 200 కోట్ల వరకు ప్రజాధనం ఆదా అవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహేష్ యాదవ్, నాగులు గౌడ్, లక్ష్మణ్, రామరాజు, రామ్ రెడ్డి, రాజేష్ గౌడ్, జితేందర్, గణేష్, ముఖేష్, వేణుగోపాల్ రెడ్డి, సమ్మెట ప్రసాద్, మాణిక్ రావు, విజయేందర్, పద్మా, మంజుల తదితరులతో పాటు కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




